కేసీఆర్ కు కవిత తాజా అల్టిమేటమ్, కాదంటే - కొత్త పార్టీ పేరుతో సిద్దం..!!
తెలంగాణ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కవిత లేఖతో ఒక్క సారిగా బీఆర్ఎస్ లో కలకలం మొదలైంది. కవిత లేఖ పైన బీఆర్ఎస్ ముఖ్య నేతలు స్పందించ లేదు. కేటీఆర్ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇటు కవిత తన మద్దతు దారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ పిలుపు కోసం వేచి చూస్తున్నారు. పార్టీకి అల్టిమేటమ్ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. తన డిమాండ్లు కేసీఆర్ ముందు ఉంచనున్నారు. తన ప్రతిపాదనల కు కేసీఆర్ అంగీకరించకుంటే.. కొత్త పార్టీకి కవిత రంగం సిద్దం చేసుకుంటున్నారు.
కేసీఆర్ పిలుపు కోసం
ఎమ్మెల్సీ కవిత తన రాజకీయ భవిష్యత్ పైన కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందు లో భాగంగా తన తండ్రితోనే తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారు. కేసీఆర్ పిలుపు కోసం కవిత ఎదురు చూస్తున్నారు. తన తండ్రితో అన్ని విషయాలు చర్చించాలని భావిస్తున్నారు. ప్రధానంగా రెండు అంశాలపై కవిత పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. పార్టీలో తనకు ప్రాధాన్యత.. భవిష్యత్ పైన స్పష్ట త కోరుతున్నారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని వ్యాఖ్యానించిన కవిత.. వాటి గురించి తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. దీని పైన కేసీఆర్ స్పందనకు అనుగుణంగా తన భవిష్యత్ కార్యాచరణ ఖరారు ప్రకటించేందుకు కవిత సిద్దం అవుతున్నారు. అవసరమైతే బీఆర్‌ఎస్ నుంచి బయటకు వెళ్లేందుకు కూడా ఆమె సిద్ధమైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కీలక మంత్రాంగం
కవిత కొత్త పార్టీ దిశగా అడుగులు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రెండు వారాల కిందటే కవిత కీలక నిర్ణయం తీసుకుంటుందని భావించారు. తప్పనిసరి పరిస్థితుల్లో బీఆర్‌ఎస్ నుంచి బయటకు వెళ్లాల్సివస్తే కొత్త పార్టీ పెట్టేందుకు కవిత సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. కొత్త పార్టీ కోసం ఇప్పటికే పేర్ల పైన చర్చించినట్లు సమాచారం. తన మానస పుత్రిక తెలంగాణ జాగృతి సంస్థ పేరునే పార్టీ పేరుగా ఖరారు చేసే అవకాశాలు లేకపోలేదని సన్నిహితులు చెబుతున్నారు. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి(టీబీఆర్‌ఎస్) పేరును కూడా ఆమెతో సన్నిహితంగా ఉండే కొందరు బీసీ నేతలు తెరపైకి తీసుకువచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా తన లేఖ లీకేజీపై కవిత తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. కావాలని కేసీఆర్ వద్ద ఉండే కొందరు లేఖ ను బయట పెట్టారని కవిత మండిపడుతున్నారు.
తేల్చాల్సిందే
తాను కేసీఆర్ కు రాసిన లేఖ ఎలా లీకైందన్న విషయం బయటకు రావాల్సిందేనని కవిత పట్టుబడుతున్నట్లు తెలిసింది. గతంలోనూ అనేక చేదు అనుభవాలను కవిత ఎదుర్కొన్నారని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. గతంలో కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడేందుకు కవిత పలుమార్లు ప్రయత్నించినా తన తండ్రికి ఫోన్ కూడా ఇవ్వకుండా చేశారని, ఇటువంటి పరిస్థితులతో కవిత మనస్థాపానికి గురయ్యారని చెబుతున్నారు. తన లేఖ లీకేజీ వీరులెవరో తెలిసేదాకా పార్టీ కార్యాల యానికి కానీ, కేసీఆర్ వద్దకు కానీ వెళ్లకూడదని భావిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా లీకు వీరులపై పార్టీ అధిష్ఠానం చర్యలు తీసుకోవాల్సిందేనని ఆమె డిమాండ్ చేస్తున్నారు. వచ్చే వారం కవిత విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications