ఈ వారం రోజులే కీలకం: పార్టీ క్యాడర్‌ను అప్రమత్తం చేసిన కేటీఆర్: పోలింగ్ సమీపిస్తోన్న వేళ
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు గడువు సమీపిస్తోన్న కొద్దీ ప్రచార జోరు పెరుగుతోంది. అన్ని ప్రధాన పార్టీలు జనంలోకి వెళ్లాయి. ఇంటింటినీ పలకరిస్తోన్నాయి. రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తోన్నాయి. ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది.
తెలంగాణలో ఈ నెల 30వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరంలో పోలింగ్ ముగిసింది.

ఎన్నికల ప్రచారంలో తీరిక లేెకుండా గడుపుతున్నారు ఆయా పార్టీల నేతలందరూ. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీ కిషన్ రెడ్డి, డాక్టర్ కెే లక్ష్మణ్.. ఇలా సీనియర్లందరూ జిల్లాస్థాయిలో సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ.. ఇలా జాతీయ స్థాయి నేతలు రంగంలోకి దిగారు.
ఈ పరిణామాల మధ్య బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్.. పార్టీ క్యాడర్, సోషల్ మీడియా సైన్యాన్ని అప్రమత్తం చేశారు. బీఆర్ఎస్‌కు చెడ్డపేరు తీసుకొచ్చేలా ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు ఫేక్ పబ్లిసిటీకి దిగుతారని, వాటిని ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని సూచించారు.
డీప్ ఫేక్ వీడియోలు, నకిలీ/తప్పుడు సమాచారంతో ఓటర్లను తప్పుడు దారి పట్టించేలా, వారిని ప్రభావితం చేసేలా వ్యవహరిస్తారని, దీన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టాలని కేటీఆర్ అన్నారు. ఇంకో వారం రోజుల్లో పోలింగ్ ఉంటుందని, అప్పటివరకు అనుక్షణం అప్రమత్తంగా ఉండక తప్పదని చెప్పారు. ఓటర్లు ఈ నకిలీ ప్రచార ఉచ్చులో పడకుండా చూడాలని కోరారు.












Click it and Unblock the Notifications