ఈటలకు మరో భారీ షాకిచ్చిన కేసీఆర్ -మెడకు నుమాయిష్ ఉచ్చు -నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీలో ఏసీబీ సోదాలు
''కేసీఆర్ ఎవరిమీదైనా పగ పడితే, వాళ్లను పూర్తిగా ఖతం పట్టించేదాకా నిద్రపోడు. నా విషయంలోనూ అదే జరుగుతోంది..'' అంటూ ఈటల రాజేందర్ వ్యక్తం చేసిన ఆందోళన అక్షరాల నిజమవుతోంది. భూకబ్జా ఆరోపణలపై మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయి, టీఆర్ఎస్ ను వీడి, కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీలో చేరిన తర్వాత కూడా ఈటలపై కేసీఆర్ వేట కొనసాగుతున్నది. తాజాగా..

నుమాయిష్‌లో ఏసీబీ సోదాలు
మాజీ మంత్రి ఈటల రాజేందర్ టార్గెట్‌గా ఏసీబీ అధికారులు హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్సొసైటీలో శుక్రవారం దాడులు నిర్వహించారు. నుమాయిష్ గా పిలుచుకునే ఈ సొసైటీకి ఈటల రాజేందర్ మాజీ అధ్యక్షుడు. ఆర్థిక మంత్రి హోదాలో ఆయన ఆరేండ్ల పాటు నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ చైర్మన్ గా వ్యవహరించారు. మంత్రి పదవి కోల్పోయిన తర్వాత, నుమాయిష్ అధ్యక్ష పదవికి కూడా ఈటల గత నెల 15న రాజీనామా చేశారు. కాగా,

గత 6ఏళ్ల ఆర్థిక లావాదేవీలపై
నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు.. గడిచిన ఆరేళ్లలో సోసైటీ ద్వారా జరిగిన మొత్తం ఆర్థిక లావాదేవీల వివరాలను సేకరిస్తున్నారు. ఈటల చైర్మన్ గా కొనసాగిన నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు డాక్యమెంట్లన్నీ పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఈటలతోపాటు ఆయన కుటుంబీకులపైనా భూకబ్జా కేసులు పెట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు నుమాయిష్ లెక్కల్లో అవకతవకలు తేలితే మాజీ మంత్రిపై మరో కేసు పెట్టడానికి సిద్దంగా ఉంది. సరిగ్గా..

ఈటలను బీజేపీ కాపాడలేదా?
టీఆర్ఎస్ ను వీడి, ఢిల్లీకి వెళ్లి, కేంద్రం పెద్దలను కలిసిన తర్వాత ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం తెలిసిందే. ఆ సమయంలో కేసుల నుంచి రక్షణ కల్పిస్తామనే హామీ కూడా లభించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈటల టార్గెట్ గా నుమాయిష్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు చూశాక రాజేందర్ ను కాపాడే విషయంలో బీజేపీ కూడా చేతులెత్తేసిందా? అనే కామెంట్లు వస్తున్నాయి. ఈటల రాజీనామాతో హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం కాగా, కొత్త కేసుల ద్వారా ఆయనను ఇరుకునే పెట్టేందుకు టీఆర్ఎస్ సర్కారు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలపై ఈటలగానీ, బీజేపీగానీ స్పందించాల్సిఉంది.












Click it and Unblock the Notifications