'ఏపీ' ఇబ్బందుల్ని అధిగమిస్తున్నాం, కొన్ని 'గాలి' వార్తలు: కెసిఆర్ ఫైర్
కరీంనగర్: సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచి వారసత్వంగా వచ్చిన ఇబ్బందులను ఒక్కొక్కటిగా అధిగమిస్తున్నామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన కొన్ని పత్రికలు పనికట్టుకొని గాలి వార్తలు రాస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం అన్నారు.
కరీంనగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఏపీ నుంచి వారసత్వంగా వచ్చిన ఇబ్బందులను ఒక్కొక్కటిగా అధిగమిస్తున్నామని, ప్రభుత్వంపైనా అనవసర విమర్శలు చేయవద్దన్నారు. సమైక్య రాష్ట్రంలో కరెంట్ కోతలతో ముప్పై ఏళ్లు ఇబ్బందులు పడ్డామన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోనే విద్యుత్ సమస్యను అధిగమించామని, ఇక్రా అనే సంస్థ తెలంగాణ రాష్ర్టానికి ఏ రేటింగ్ ఇచ్చిందని, అంచనాలకు తగ్గట్టుగా బడ్జెట్ రూపొందించుకుంటున్నామన్నారు. రాష్ట్రఆర్థిక పరిస్థితిపై కొన్ని పత్రికలు పనిగట్టుకుని వార్తలు రాయడం సరికాదన్నారు.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం నీటి ప్రాజెక్టుల విషయంలో దగాపడిందన్నారు. ప్రాణహితకు మహారాష్ట్ర ఒప్పుకోకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్లలో కాల్వలు తవ్వారని, ప్రాణహిత ద్వారా రంగారెడ్డి జిల్లాకు నీళ్లు రావని చెప్పారు. పాలమూరు ఎత్తిపోతలతోనే అది సాధ్యమన్నారు.
ఎవరు అరిచి గీపెట్టినా రైతుల సంక్షేమమే తమ సర్కార్ లక్ష్యమని చెప్పారు. ఇంటింటికి నీరు అందిస్తామన్నారు. రాష్ట్రంలో నీటి పారుదలపై కొత్త విధానం తీసుకొత్సామని చెప్పరారు. ఏపీ ముఖ్యమంత్రుల అసమర్థత వల్ల జరిగిన నష్టాన్ని ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు.

ఒక్కో ప్రాజెక్టులో ఏం జరిగిందో ప్రజల ముందు పెడతామన్నారు. ఎక్కడ బ్యారేజీ కట్టాలో, కాల్వ తవ్వాలో నిపుణులు చెప్పాలని, రాజకీయ నేతలు కాదన్నారు. ఎస్‌ఎల్‌బీసీ 30 - 40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉందన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా రంగారెడ్డి జిల్లాకు నీళ్లు ఇస్తామన్నారు.
బాబ్లీ విషయంలో టీడీపీ ఆడిన డ్రామాలు అందరికీ తెలుసన్నారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి, దాని ఉప నదులపై 200 ప్రాజెక్టులు కట్టిందని, మహారాష్ట్ర సర్కార్ అన్ని ప్రాజెక్టులు కడుతుంటే ఒక్క నాయకుడు మాట్లాడలేదన్నారు. ఇంద్రావతి, ప్రాణహితే మనకున్న నదులన్నారు.
పలు ప్రాజెక్టుల్లో ఎవరి వాటా వాళ్లు జేబులో వేసుకున్నారని, కానీ చుక్క నీరు రాలేదన్నారు. ఏ ప్రాజెక్టు వల్ల ఎక్కడ నష్టపోయామన్న విషయాన్ని చెప్తామన్నారు. ఇప్పుడే పునాది రాళ్లు వేస్తున్నామని, ఏ పనీ ఆదరా బాదరాగా చేయొద్దన్నారు. సాగుకు నీరు అందిస్తామన్నారు.
రాబోయే నాలుగేళ్లలో గ్రామజ్యోతికి రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. స్వచ్ఛ హైదరాబాద్‌లో విజ్ఞప్తుల మేరకు రూ.200 కోట్ల విలువైన పనులు మంజూరు చేశామని, జీహెచ్‌ఎంసీ పరిధిలో పారిశుద్ధ్య పనుల కోసం 2,500 ఆటోలకు ఆర్డర్ ఇచ్చామన్నారు. దశాబ్దాల నిర్లక్ష్యం వల్ల తెలంగాణ గ్రామాలు మురికికూపాలుగా మారాయన్నారు.












Click it and Unblock the Notifications