వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ద్వంద్వ ప్రమాణాలంటే ఇలాగే: కాళేశ్వరంపై కెసిఆర్ సర్కార్ వింత వాదనలు

సాగునీటి ప్రాజెక్టు కింద భూ సేకరణలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ అమలు చేయడానికి బదులు దాటవేత వ్యూహంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చేయాలని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కంకణ బద్ధులయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాణహిత నుంచి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల వరకు ఎత్తిపోతల ద్వారా హైదరాబాద్ వరకూ నీరు మళ్లిస్తామని హామీ ఇచ్చారు.

తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడం.. వైఎస్ మరణం.. తెలంగాణ రాష్ట్ర కల సాకారం ఒకదాని వెంట మరొకటి జరిగిపోయాయి. తాజాగా 'ప్రాణహిత - చేవెళ్ల' ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర పరిస్థితులు, అన్నదాతల ప్రయోజనాలకు అనుగుణంగా కాళేశ్వరం వద్ద ఒక రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్నది.

అక్కడ నుంచి మిడ్ మానేరు.. తదుపరి సుందిళ్ల.. మల్లన్న సాగర్.. దేవాదుల ఎత్తిపోతల పథకం.. తిరిగి ఎస్సారెస్పీ ప్రాజెక్టు పునర్జీవనానికి శ్రీకారం చుట్టారు సీఎం కేసీఆర్. ఈ ప్రాజెక్టులన్నీ సకాలంలో పూర్తయితే యావత్తు తెలంగాణ సస్యశ్యామలమవుతుంది. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సర్కార్ అనుసరిస్తున్న తీరు.. ఆ దిశగా వేస్తున్న అడుగులు మాత్రం వివాదాస్పదంగా, సందేహస్పదంగా ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. దీనికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో తెలంగాణ ప్రభుత్వం చేసిన వాదనలే ఇందుకు నిదర్శనమని చెప్తున్నారు.

 న్యాయస్థానం మొట్టికాయల తర్వాత ఇలా భూసేకరణ చట్టం రూపకల్పన

న్యాయస్థానం మొట్టికాయల తర్వాత ఇలా భూసేకరణ చట్టం రూపకల్పన

సాగునీటి ప్రాజెక్టు కింద భూ సేకరణలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ అమలు చేయడానికి బదులు దాటవేత వ్యూహంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. తొలుత జీవోలతో భూ సేకరణకు దిగిన ఏలికలు.. తర్వాత న్యాయస్థానం మొట్టికాయలతో ఎట్టకేలకు 2013 నాటి కేంద్ర భూసేకరణ చట్టం వెలుగులో రాష్ట్రస్థాయిలో ఒక భూసేకరణ చట్టం చేసింది. కానీ అది పేరుకు చట్టమైనా.. ఆచరణలో ప్రభుత్వం అనుకున్న విధానాలకే కట్టుబడి ఉన్నదన్న వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారించిన జాతీయ గ్రీన్ ట్రిబ్యూనల్ ముందు సర్కార్.. రకరకాల.. విభిన్న రీతిలో పరస్పర భిన్నమైన వాదనలు వినిపించింది.

మధ్యాహ్నం యూ టర్న్ ఇలా

మధ్యాహ్నం యూ టర్న్ ఇలా

తొలుత కాళేశ్వరం 'తాగునీటి' ప్రాజెక్టు అని, గోదావరి జలాలను హైదరాబాద్‌కు తరలించే 'లక్ష్యం'తో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని తెలిపిన తెలంగాణ ప్రభుత్వం తాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ, అటవీ అనుమతులు అవసరం లేదని వాదించింది. రాష్ట్ర సర్కారు.. ఒకవేళ భవిష్యత్‌లో ఆ అనుమతులు వస్తే ఈ తాగునీటిని 'సాగు' నీటి అవసరాలకు వినియోగిస్తామని పేర్కొన్నది. అటవీ స్థలంలో, వన్యప్రాణి సంరక్షణ స్థలానికి పది కిలోమీటర్ల దూరంలో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టవద్దన్న అంశంపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌ లేవనెత్తిన సందేహాలకు తెలంగాణ ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో 'ప్రాజెక్టు నిర్మాణం పనులు మూడు నెలలు ఎందుకు ఆపకూడదు' అని ధర్మాసనం ప్రశ్నించింది.

పర్యావరణ, అటవీశాఖ అనుమతులు లేకుండానే నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిలుపుదల చేయాలంటూ ఎండీ హయతుద్దీన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్టీటీ విచారించింది. జస్టిస్‌ జావెద్‌రహీం నేతృత్వంలోని ధర్మాసనం కేసు విచారించింది. తెలంగాణ తరఫున మాజీ అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. కాగా రాష్ట్ర ప్రభుత్వ వాదనను పిటిషనర్‌ తరఫు న్యాయవాది తప్పుపట్టారు. సాగునీటి ప్రాజెక్టును తాగునీటి ప్రాజెక్టుగా చెబుతూ.. ధర్మాసనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు.

కాళేశ్వరం ముమ్మాటికీ సాగునీటి ప్రాజెక్టు అని... రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అనుమతుల కోసం చేసిన దరఖాస్తుల్లోనూ 'సాగునీటి' ప్రాజెక్టుగా పేర్కొన్నారని స్పష్టం చేశారు. మిషన్‌భగీరథ ప్రాజెక్టు పైప్‌లైన్‌ నిర్మాణాలను కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌ చిత్రపటంలో చేర్చి కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణాలకు తాము వ్యతిరేకం కాదని, అందుకు సంబంధించిన మార్గదర్శకాలను పాటించాలని మాత్రమే అభ్యర్థిస్తున్నామని వివరించారు.

ఉమ్మడి ఏపీ హయాంలో ఇలా ప్రాణహిత - చేవెళ్లకు శ్రీకారం

ఉమ్మడి ఏపీ హయాంలో ఇలా ప్రాణహిత - చేవెళ్లకు శ్రీకారం

ఉదయం విచారణలోకాళేశ్వరం కేవలం తాగునీటి ప్రాజెక్టు మాత్రమేనని ముకుల్ రోహత్గీ వాదించారు. కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లి అక్కడి నుంచి బ్యాక్‌ ఫ్లో ద్వారా మిడ్‌మానేరు, మల్లన్నసాగర్‌, కొండ పోచమ్మ మీదుగా హైదరాబాద్‌ నగరానికి తాగునీటి అవసరాలకు మళ్లించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని తెలిపారు. తాగునీటి అవసరాలను తీర్చడం ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రజాభిప్రాయ సేకరణ సైతం పూర్తి చేశామని చెప్పారు. ఇక మధ్యాహ్నం జరిగిన విచారణలో ముకుల్ రోహత్గీ కాళేశ్వరం బహుళ ప్రయోజనాల ప్రాజెక్టు అని యూ టర్న్‌ తీసుకున్నారు.

తేలిగ్గా మాట మార్చేశారు. తాగునీటి కోసం ప్రాజెక్టు నిర్మిస్తున్నామని అంటూనే సాగునీటి వినియోగానికి అవసరమైన పర్యావరణ, అటవీ అనుమతుల కోసం దరఖాస్తు చేశామని చెప్పారు. భవిష్యత్‌లో అటవీ, పర్యావరణ అనుమతులు వస్తే తాగునీటిని సాగుకు వినియోగిస్తామని పేర్కొన్నారు. పైగా రూ. లక్ష కోట్లతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతుందని తెలిపారు. ఉమ్మడి ఏపీలోనే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ, అటవీ అనుమతుల కోసం దరఖాస్తు చేశారని, మహారాష్ట్ర అభ్యంతరం తెలియజేయడంతో రాలేదని చెప్పారు.

తెలంగాణ ఏర్పాటైన తర్వాత మహారాష్ట్రతో అవగాహనా ఒప్పందం చేసుకున్నామని, తర్వాత. ప్రాణహిత ప్రాజెక్టును కాళేశ్వరంగా మార్చామని వివరించారు. ప్రాజెక్టు నిర్మాణానికి అటవీభూమి వినియోగించబోమని, మళ్లించబోమని చెప్పారు. మూడు నెలలు కేసు విచారణను నిలిపి వేయాలని, ఆ తరువాత పర్యావరణ, అటవీ అనుమతుల పురోగతిని వివరిస్తామని తెలిపారు.

ముకుల్ రోహత్గీ వాదనలు ఇలా తప్పు

ముకుల్ రోహత్గీ వాదనలు ఇలా తప్పు

తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టును తాగునీటి ప్రాజెక్టుగా పేర్కొంటుందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది సంజరు ఉపాధ్యాయ వాదించారు. ముకుల్‌రోహత్గీ వాదనలను తప్పుపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ, అటవీశాఖ అనుమతులు రాలేదన్న సంగతి రాష్ట్ర ప్రభుత్వానికి సైతం తెలుసని అన్నారు. తాము సాగు, తాగునీటి ప్రాజెక్టులు వ్యతిరేకం కాదని, కానీ ఏదైనా ప్రాజెక్టు నిర్మిస్తే అందుకు అవలంబించాల్సిన పద్ధతులను విస్మరించరాదని అన్నారు. కాళేశ్వరం పూర్తిగా సాగునీటి ప్రాజెక్టు అని, పాక్షికంగా తాగునీటి అవసరాలనూ తీర్చనున్నదని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పర్యావరణ, అటవీ అనుమతుల కోసం చేసిన దరఖాస్తుల్లోనూ కాళేశ్వరం ప్రాజెక్టును 'సాగునీటి'గా పేర్కొన్నారని వివరిస్తూ సంబంధిత పత్రాలను ధర్మాసనానికి నివేదించారు. పైగా ఈ ప్రాజెక్టు 'అంతరాష్ట్ర ప్రాజెక్టు' అని కూడా ఎన్జీటీ ద్రుష్టికి తెచ్చారు. మహారాష్ట్రలో ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదని వివరించారు.

అటవీ స్థలాన్ని వినియోగిసతున్నట్లు ఫొటోల నివేదన

అటవీ స్థలాన్ని వినియోగిసతున్నట్లు ఫొటోల నివేదన

రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నట్టుగా రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయినా.. పర్యావరణ, అటవీ శాఖ అనుమతులు రావాలంటే చాలా సమయం పడుతుందని స్పష్టం చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎలాంటి సరైన అనుమతులు లేకుండానే ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకుందని చెప్పారు. గత జనవరి నుంచి నిర్మాణం పనులు మొదలు పెట్టారని తెలిపారు. పైగా అటవీ స్థలాన్ని సైతం వినియోగిస్తున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. సంజరు ఉపాధ్యాయ స్వయంగా ప్రాజెక్టు స్థలం వద్ద సాగుతున్న నిర్మాణాలపై తీసిన ఫోటోలను ధర్మాసనానికి అందజేశారు. ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయనడానికి మహారాష్ట్ర సమర్పించిన అఫిడవిట్‌ నిదర్శనమని చెప్పారు. మహారాష్ట్ర ఒప్పందంలోనూ సాగునీటిపై సహాకారం గురించి పేర్కొన్నారని తెలిపారు.

వేగంగా పనులు జరుగుతున్నాయని తెలంగాణ ప్రభుత్వ వాదన ఇలా

వేగంగా పనులు జరుగుతున్నాయని తెలంగాణ ప్రభుత్వ వాదన ఇలా

ప్రభుత్వం రూ. లక్ష కోట్లతో ప్రాజెక్టును నిర్మిస్తున్నామని వెల్లడించిందని, ఇంతపెద్దమొత్తంలో నిర్మించే ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి జరుగుతున్న నష్టంపై కూడా అంచనా వేయాలి కదా అని అన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయా అని తెలంగాణను ప్రశ్నించింది. అంతకుముందే ముకుల్‌రోహత్గీ వెళ్లిపోవడంతో ఆయన జూనియర్‌ న్యాయవాది సమాధానమిస్తూ ప్రాజెక్టు నిర్మాణం పనులు వేగవంతంగా సాగుతున్నాయని, ఎక్కడా అటవీభూముల్లో ఉల్లంఘనలు జరగడం లేదని చెప్పారు. అనంతరం కేసును గురువారానికి వాయిదా వేశారు. అంతరాష్ట్ర ప్రాజెక్టు' అని స్పష్టం చేశారు. పర్యావరణ, అటవీశాఖ అనుమతులు వచ్చే వరకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పనులు మూడు నెలలు నిలిపివేయొచ్చు కదా అని జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) వ్యాఖ్యానించించింది.

English summary
Telangana Government stance on irrigation projects is suspectable, disputable. It's argued different tones in One day. It is argued in the morning drinking water project to Hyderabad people and afternoon took U-turn and argued this project Multilateral project. Telangana Government has started project work in last January.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X