దమ్మున్న నాయకుడు కేసీఆర్: కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!!
నేడు మహాత్మ జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో జ్యోతిబా పూలే జయంతి వేడుకలను నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహాత్మ జ్యోతిబా పూలే ఎంచుకున్న మార్గం, ఆయన చేసిన బోధనలు అందరికీ ఆచరణీయమని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఆ బాధ్యత ప్రభుత్వాలపై ఉంది
సమాజంలోని అన్ని వర్గాల వారు జ్యోతిబాపూలే వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవాలని కేటీఆర్ పేర్కొన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మనం ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా ఉపాధి కల్పన విషయంలో అందరం సమానమేనని ప్రభుత్వాలు గుర్తించాలన్నారు.

దళిత బంధు, బిసి బందు పథకాలతో రిస్క్ తీసుకున్న కేసీఆర్
ఇదే సమయంలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తూ బాధ్యతను నిర్వహిస్తామని కేటీఆర్ వెల్లడించారు. ఇక్కడ రాష్ట్రంలో దళిత బంధు, బిసి బందు వంటి పథకాలను ప్రవేశపెట్టి కెసిఆర్ ఎంతో రిస్క్ తీసుకున్న దమ్మున్న నాయకుడని, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఎవరికీ భయపడకుండా కీలక నిర్ణయాలు తీసుకున్నారని కేటీఆర్ అన్నారు.
బడుగు బలహీన వర్గాలకు సీట్లు ఇచ్చిన ఏకైక పార్టీ బి ఆర్ ఎస్
అసెంబ్లీలో అత్యధికంగా బడుగు బలహీన వర్గాలకు సీట్లు ఇచ్చిన ఏకైక పార్టీ బి ఆర్ ఎస్ పార్టీ అని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్లో ఐదు రిజర్వేషన్ సీట్లు పోతే మిగతా 12 సీట్లలోనూ 50 శాతం కంటే ఎక్కువ బడుగు బలహీన వర్గాలకే అవకాశం కల్పించారని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు.
కాంగ్రెస్ వెంటనే ఆ పనులు చెయ్యాలి
ఎన్నికల ముందు బీసీల ఓట్లు దండుకునేందుకు కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ఇచ్చిందని, ఇచ్చిన మాట ప్రకారం బిసి డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎంబీసీలకు ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని చెప్పారని తక్షణం ఆ పని చేయాలన్నారు. రానున్న బడ్జెట్లో 20వేల కోట్ల రూపాయలు బీసీలకు కేటాయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications