కేసీఆర్ పై ముప్పేట దాడి: లోక్సభ ఎన్నికల వేళ.. బీఆర్ఎస్ లో భారీ కుదుపులు!!
ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి అంటే ఇదేనని ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ జరుగుతుంది. పదేళ్ళ కాలం తెలంగాణా రాష్ట్రాన్ని శాసించిన బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయారు. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రభావాన్ని కోల్పోయిన బి ఆర్ ఎస్ పార్టీ, లోక్సభ ఎన్నికల్లో పుంజుకుంటుందా అంటే ఆ పరిస్థితి లేకుండా పోయింది.
బీఆర్ఎస్ నుండి కొనసాగుతున్న వలసల పర్వంతో పాటు, కెసిఆర్ కుమార్తె కవిత ను ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేయడంతో ఆయన పరిస్థితి మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు అయింది. ఒకపక్క లోక్సభ ఎన్నికల షెడ్యూల్ నేడు రానున్న నేపథ్యంలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లడం పైన ఫోకస్ పెట్టి అభ్యర్థులను ప్రకటించి ముందుకు సాగాల్సిన సమయంలో కెసిఆర్ పై ముప్పేట దాడి మొదలైంది.

ఒకవైపు కాంగ్రెస్ గేట్లు తెరిచి బీఆర్ఎస్ పార్టీలోని ముఖ్య నేతలను రారమ్మని ఆహ్వానిస్తూ ఉంటే, మరోవైపు బిజెపి కూడా కారు పార్టీ నేతలను కాషాయ తీర్థం పుచ్చుకునేలా చేస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీలో మంత్రులుగా వ్యవహరించిన కీలక నేతలను పార్టీ మారకుండా అడ్డుకోవడంలో కెసిఆర్ విఫలమవుతున్నారు. కెసిఆర్ బుజ్జగించినప్పటికి పార్టీ నేతలు జంప్ జిలాని అంటున్నారు.
ఇక ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి ఫోకస్ చేయాల్సిన క్షణంలో, కెసిఆర్ పైన పిడుగు పడ్డట్టు కవిత అరెస్టు వ్యవహారం మారింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణను ఎదుర్కొంటున్న కవితను నిన్న ఈడి అధికారులు అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకువెళ్లారు. ఐదు గంటలపాటు కవిత ఇంట్లో సోదాలు జరిపిన ఈడి అధికారులు, ఆమెను విచారించి అదుపులోకి తీసుకున్నారు.
నేడు కవితను కోర్టులో హాజరు పరచనున్న క్రమంలో కేసీఆర్, కేటీఆర్ లు ఢిల్లీకి వెళ్లారు. ప్రస్తుతం ఎన్నికల విషయాన్ని పక్కనపెట్టి, కవిత కోసం ఢిల్లీ వేదికగా న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అన్ని వైపుల నుండి దాడి జరుగుతున్న క్రమంలో బీఆర్ఎస్ లో ఉన్న నాయకులకు వెన్నులో వణుకు పుడుతుంది.












Click it and Unblock the Notifications