డబుల్ బెడ్రూమ్స్: అమరావతి శంకుస్థాపనకు కెసిఆర్ డౌట్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హాజరు కావడం సందేహంగానే ఉంది. దసరా పర్వదినమైన అక్టోబర్ 22వ తేదీన అమరావతి శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. అదే రోజున తాను ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ కార్యక్రమానికి కెసిఆర్ శ్రీకారం చుడుతున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారంనాడు గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. డబుల్ బెడ్రూం ప్రారంభ కార్యక్రమానికి ఆయన కెసిఆర్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అదే విధంగా బతుకమ్మ ముగింపు ఉత్సవాలకు కూడా గవర్నర్‌ను ఆయన ఆహ్వానించినట్లు చెబుతున్నారు.

బతుకమ్మ ముగింపు ఉత్సవాలు హైదరాబాదులోని ట్యాంక్‌బండ్‌పై ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా జరగనున్నాయి. నిరుటి నుంచి సద్దుల బతుకమ్మ నిర్వహణ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపడుతోంది.
కాగా, అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 18వ తేదీన కెసిఆర్‌ను స్వయంగా కలిసి ఆహ్వాన పత్రికను అందిస్తారని చెబుతున్నారు. అయితే, కెసిఆర్ తాను వెళ్లలేని స్థితిలో ఎవరినైనా తన ప్రతినిధిగా అమరావతికి పంపిస్తారా అనేది చూడాల్సిందే.












Click it and Unblock the Notifications