సేవలు-ఉపయోగం: డీఎస్ ఇంటికెళ్లి సిఎం కెసిఆర్ మంతనాలు
హైదరాబాద్: సుదీర్ఘ కాలంపాటు కాంగ్రెస్ పార్టీకి సేవలందించి ఇటీవలే తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన సీనియర్ నాయకుడు డి శ్రీనివాస్ ఇంటికి తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు వెళ్లారు. బుధవారం మధ్యాహ్నం డీఎస్ ఇంటికి వెళ్లిన కేసీఆర్.. దాదాపు అరగంటకు పైగా అక్కడే ఉన్నారు.
తన భోజనం కూడా డీఎస్ ఇంట్లోనే చేశారు. ఆయనతో పాటు తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మరికొందరు నాయకులు కూడా డీఎస్ ఇంటికి వెళ్లారు. అయితే కేసీఆర్ మాత్రం.. ఏకాంతంగా డి శ్రీనివాస్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. డీఎస్ సేవలను పార్టీకి ఏ రకంగా ఉపయోగించుకోవాలనే అంశంపై టిఆర్ఎస్ అధినేత ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
డిఎస్‌కు ఎమ్మెల్సీ లాంటి చిన్న పదవితో సరిపెట్టకుండా జాతీయస్థాయిలో లేదా రాష్ట్రస్థాయిలో సేవలు వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యత్వం ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా ఉందని సమాచారం. మరో రెండు రోజుల్లో డీఎస్‌కు ఎలాంటి పదవి ఇస్తారనే విషయంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఆర్థిక పరిస్థితికి ఎలాంటి ఢోకా లేదు: అన్ని రంగాల్లో వృద్ధి సాధిస్తాం
రాబోయే రోజుల్లో తెలంగాణ ఆదాయం మరింత గొప్పగా పెరగనుందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో ఈటెల మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆశయాల మేరకే ఆదాయం పెరుగుతోందని తెలిపారు. తెలంగాణ ఆదాయంపై కొన్ని పత్రికలు చేస్తున్న విష ప్రచారం నమ్మొద్దు అని సూచించారు.
అన్ని రంగాల్లో వృద్ధి రేటును సాధిస్తున్నామని స్పష్టం చేశారు. బడ్జెట్ అంచనాలను సాధించే దిశగా వృద్ధి రేటు కొనసాగుతోందన్నారు. ఖజానాలో డబ్బు లేదనడం అవాస్తవమన్నారు. తెలంగాణ దేశంలోనే అగ్రగామి రాష్ట్రమని పేర్కొన్నారు. సేల్స్‌ట్యాక్స్ వసూలు భారీగా పెరిగిందన్నారు. నిరుడు జూన్‌లో రూ. 2,265 కోట్లు వసూలైతే ఈ ఏడాది జూన్‌లో రూ. 2,425 కోట్లు వసూలైందని చెప్పారు.
నిరుడు జులైలో రూ. 24 వందల కోట్లు వసూలైతే, ఈ ఏడాది జులైలో రూ. 2,650 కోట్లు వసూలైందని ప్రకటించారు. రెవెన్యూ ఇన్‌కం అంచనా 28 శాతం ఉంటే ఇప్పటికే 24 శాతం సాధించామని తెలిపారు. పరిశ్రమలకు అనుమతుల కోసం గతంలో పారిశ్రామికవేత్తలు చెప్పులు అరిగేలా తిరిగేవారు అని గుర్తు చేశారు. ఇప్పుడు 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులిస్తున్నామని తెలిపారు.












Click it and Unblock the Notifications