సాధారణ విషయం కాదు: ప్రధాని మోడీ ప్రశంసలపై కేసీఆర్

హైదరాబాద్ : పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణం తెలంగాణ ప్రభుత్వం సృష్టించిందని ప్రధానమంత్రి స్థాయి వారు కూడా మాట్లాడటం సాధారణ విషయం కాదని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆయన ఫార్మాసిటీ, ఐటీ, టెక్స్‌టైల్ పార్కు, ఓఆర్‌ఆర్‌ల నిర్మాణం తదితరాలపై సమీక్ష జరిపారు.

రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొందని, దేశ విదేశాలకు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీలతో పాటు చిన్నచిన్న కంపెనీలు కూడా హైదరాబాద్‌లో ఫార్మా పరిశ్రమలు నెలకొల్పడానికి ముందుకు వస్తున్నాయని సీఎం చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించిందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించడం సాధారణ విషయం కాదని ఈ సందర్భంగా సీఎం కెసిఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ పారిశ్రామిక విధానంపై ప్రధాని మోడీ ఇటీవల ప్రశంసించిన విషయం తెలిసిందే. కాగా, పెట్టుబడుల కేంద్రంగా హైదరాబాద్ ఎదుగుతున్నదని సీఎం కెసిఆర్ చెప్పారు. పరిశ్రమలు ఏర్పాటుచేసేందుకు ఇక్కడున్న అనుకూలతలను ప్రపం చం గుర్తిస్తున్నదని అన్నారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ విధానాలు, ప్రణాళికలు, కార్యాచరణ అందుకు అనుగుణంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేకించి ఫార్మాసిటీ విస్తరణకు నగరంలో అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఫార్మా సిటీలో భాగంగానే నివాస ప్రాంతాలు, కామన్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఉండాలని అధికారులకు సూచించారు.

ఇతర దేశాలు, రాష్ట్రాల్లో కామన్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఎలా పనిచేస్తున్నాయో అధ్యయనం చేయాలని, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో వస్తున్న కొత్త ధోరణులను కూడా పరిశీలించాలని సీఎం చెప్పారు. మానవాళికి ఔషధాల అవసరం ఎక్కువవుతున్న నేపథ్యంలో ఫార్మా పరిశ్రమ మరింత విస్తరిస్తుందన్నారు. ఫార్మా కంపెనీల ఏర్పాటుకు హైదరాబాదే అనువైనప్రాంతంగా అందరూ గుర్తించారని చెప్పారు.

KCr on Narendra modi comments

పరిశ్రమలు, ఐటీ కంపెనీలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, సహకారాన్ని మరింత విస్త్రతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఐటీ రంగం కూడా తెలంగాణలో బాగా విస్తరిస్తున్నదని సీఎం చెప్పారు. ఐటీ పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాలని సీఎం చెప్పారు. దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు బెంగళూరు, హైదరాబాద్ నగరాలే సరైనవని అందరూ గుర్తిస్తున్నారన్నారని సీఎం కేసీఆర్ చెప్పారు.

ఇటీవల చెన్నైలో సంభవించిన తుఫాను, వరదలతో ఆ నగరం నుంచి కూడా కొన్ని కంపెనీలు వెనక్కు మళ్లుతున్నాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ నగరంపై ఉన్న అంచనాలు నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం తరఫున తగుచర్యలు తీసుకోవాలని చెప్పారు.

పెట్టుబడుదారులను ప్రోత్సహించేందుకు అవసరమైన పూర్వరంగాన్ని సిద్ధం చేయాలని సూచించారు. ఆర్థికంగా బలంగా ఉన్న పరిస్థితిని అనుకూలంగా మార్చుకుని ఐటీ రంగానికి ప్రోత్సాహం అందించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇక్కడి జినోమ్ వ్యాలీలో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని, టీ-హబ్ కూడా మంచి ఫలితాలనిస్తున్నదని చెప్పారు.

ప్రపంచంలోని చాలా కంపెనీలు తమ బ్యాకాఫీసును హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నాయని గుర్తుచేశారు. హైదరాబాద్ తరువాత వరంగల్‌లో కూడా ఐటీ రంగం విస్తరణకు ఎక్కువ అవకాశాలున్నాయని చెప్పారు. వరంగల్‌లో అతి పెద్ద టెక్స్‌టైల్ పార్కు రాబోతున్నదని, దీనివల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని కేసీఆర్ చెప్పారు.

పరిశ్రమలు, ఫార్మా సిటీ, ఐటీ కంపెనీలు, టెక్స్‌టైల్ పార్కు తదితర ఉపాధి కల్పన కార్యకలాపాలవల్ల తెలంగాణ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ కూడా పెరుగుతుందని, హైదరాబాద్‌తోపాటు ఇతర నగరాల్లో కూడా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎక్కడెక్కడ ఓఆర్‌ఆర్‌లు రావాలో ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎం చెప్పారు.

ఇది ఇలా ఉండగా, తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఆరు నెలల కాలంలోనే తాము పరిశ్రమ స్థాపించి ఉత్పత్తి ప్రారంభించగలిగామని, ఈ ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారం వల్లనే సాధ్యమయిందని మైక్రో మ్యాక్స్ కంపెనీ యాజమాన్యం పేర్కొంది. ఈ మేరకు వారు పంపిన సందేశాన్ని ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ముఖ్యమంత్రికి వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+