ఉత్తర తెలంగాణపై తుఫాను ప్రభావం: కెసిఆర్
న్యూఢిల్లీ: హధుద్ తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో పాటు పోలీసు, రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. తుఫాను ప్రభావం ఆదివారం సాయంత్రం ఉండవచ్చునని, తుఫాను ప్రభావం ఉత్తర తెలంగాణపై ఉండవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు.
భారీ వర్షాలు పడితే చెరువుల కట్టలు తెగే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. తుఫాను నేపథ్యంలో సచివాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. తుఫాను వివరాల కోసం 23454088, 23454293 నెంబర్లకు ఫోన్ చేయాలని ఆయన సూచించారు. జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

విజయ్ కుమార్ మృతికి సంతాపం
కరీంనగర్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టు జీవగడ్డ విజయ్ కుమార్ మృతికి కెసిఆర్ సంతాపం వ్యక్తం చేశారు. విజయ్ కుమార్ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కరీంనగర్ కేంద్రంగా విద్యుల్లత, జీవగడ్డ పత్రికలను విజయ్ కుమార్ నడిపినట్లు ఆయన గుర్తు చేశారు. జీవితాంతం విజయ్ కుమార్ వృత్తి పట్ల నిబద్ధత ప్రదర్శించారని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్న విజయ్ కుమార్ ఎంతో మంది జర్నలిస్టులకు గురువుగా వ్యవహరించి జీవితాన్ని సార్థకం చేసుకున్నారని ఆయన అన్నారు.
సిఎంతో ఎన్టీపిసి సిఎండీ భేటీ
ముఖ్యమంత్రి కెసిఆర్‌తో నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ (ఎన్టీపిసి) సిఎండి అరుప్ రాయ్ చౌదరి సమావేశమయ్యారు. రాష్ట్రంలో విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కరెంట్ కష్టాలపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications