TS Polls: కాంగ్రెస్ గెలిచే సీట్లివే ? కేసీఆర్ ది ఆత్మ విశ్వాసమా ? అతివిశ్వాసమా ?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ పార్టీల ప్రచారం కూడా జోరందుకుంటోంది. ముఖ్యంగా ప్రత్యర్ధులపై మాటల దాడిని తీవ్రతరం చేసిన నేతలు జనంలో తమదే ఆధిపత్యం అని నిరూపించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇదే క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ పవనాలు వీస్తున్నాయన్న అంచనాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇవాళ మధిరలో నిర్వహించిన ప్రచారంలో స్పందించారు.
ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోందన్న ప్రచారం ఒట్టిదేనని కేసీఆర్ కొట్టిపారేశారు. అంతే కాదు కాంగ్రెస్ పార్టీకి ఈసారి కూడా 20 లేదా అంతకన్నా తక్కువ సీట్లే వస్తాయన్నారు. ఇప్పటివరకూ తాను 70 సీట్లలో ప్రచారం చేశానని, అలాగే తాను ప్రచారం చేసిన చోట్ల కాంగ్రెస్ ఊడ్చుకుని పోతుందని చెప్పేశారు. మరో 30 సీట్లలో తాను ప్రచారం చేస్తే కాంగ్రెస్ అక్కడా ఓడిపోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో డజను మంది సీఎం అభ్యర్ధులు ఉన్నారంటూ మధిరలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. భట్టి గెలిచేది లేదూ సీఎం అయ్యేదీ లేదంటూ కేసీఆర్ తేల్చేశారు.

అయితే కేసీఆర్ ఈసారీ కాంగ్రెస్ పార్టీ 20 సీట్లకే పరిమితం అవుతుందంటూ చేసిన వ్యాఖ్యలపై మాత్రం చర్చ జరుగుతోంది. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమంటూ ఇప్పటికే పలు సర్వేలు స్పష్టం చేయడం, కర్నాటకలో కాంగ్రెస్ గెలుపు తర్వాత మారిన పరిస్దితుల్లో తెలంగాణలోనూ కాంగ్రెస్ గాలి వీస్తోందంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో అదేమీ లేదని ఓటర్లకు చెప్పేందుకే కేసీఆర్ 20 సీట్ల వ్యాఖ్యలు చేశారా అన్న చర్చ జరుగుతోంది.
లేకపోతే సొంత ఇంటెలిజెన్స్ రిపోర్టులు దగ్గర పెట్టుకుని, ఎన్నికల సర్వేలు కూడా చేయించుకుంటూ కేసీఆర్ కాంగ్రెస్ ను ఇంత తక్కువ అంచనా వేయడం చూస్తే కేవలం ఓటర్ల దృష్టి మరల్చేందుకే అన్న చర్చ జరుగుతోంది. ఏదేమైనా మరో 9 రోజుల్లో తెలంగాణలో ఎన్నికల పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న జరిగే కౌంటింగ్ లో తెలంగాణ బాద్ షా ఎవరో తేలిపోనుంది.












Click it and Unblock the Notifications