లక్ష కన్నా ఎక్కువే, తక్కువ ఉండవు: సీఎం కేసీఆర్, గ్రూప్ 2 అవకతవకలపై నిలదీత

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోట నుంచి చెప్పినట్లు 1.12 లక్షల పోస్టుల భర్తీకి కట్టుబడి ఉన్నామని, మరో వెయ్యి పోస్టులు ఎక్కువే భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు.

ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ప్రభుత్వ ఉద్యోగాలు నాలుగు లక్షలకు మించి ఉండబోవని, నిరుద్యోగులకు అవకాశం ఉన్నంత వరకూ ఉద్యోగాలు కల్పిస్తూనే ఉన్నామన్నారు. సభ్యులు నిర్మాణాత్మకంగా సలహాలిస్తే తీసుకోవడానికి సిద్ధమన్నారు.

గ్రూప్‌ 2 పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయని, కొత్త పోస్టులనూ కలిపి మళ్లీ పరీక్షలు నిర్వహించాలని కాంగ్రెస్‌ సభ్యులు సంపత్ కుమార్‌ డిమాండ్‌ చేశారు. గ్రూప్ 2 రాత పరీక్షలో కోడింగ్‌, డాటా, వైట్‌నర్‌ వాడడం వంటి అవకతవకలు జరిగాయని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్‌ పత్రికా ప్రకటన చేశారని, కోర్టులో రిట్‌ పిటిషనూ బుక్‌ అయిందని, ప్రభుత్వం కూడా కౌంటర్‌ దాఖలు చేసిందన్నారు. ఓఎంఆర్‌ టాంపరింగ్‌ జరిగిందని సంపత్‌ ఆరోపించారు.

KCR promises to fill 1.12 lakh job vacancies soon

గ్రూప్ 2 పరీక్షల్లో అవకతవకలతోపాటు అంబేడ్కర్‌ ఓవర్‌సీస్‌ విద్యా నిధి పథకంపై సీఎం కేసీఆర్‌ స్పందించారు. నిరుద్యోగులు ఉద్యోగాలను ఆశిస్తుంటారని, కాబట్టి అందులో నుంచి మూట కట్టుకుందామని సోనియా పేరునూ తీసుకు వచ్చి అమరులు, గిమరులు అంటూ మాట్లాడుతున్నారని, అవి ఓల్డ్‌ పాలిటిక్స్‌ అని, అలాంటివి పని చేయవన్నారు.

సోషల్‌ మీడియాలో నిజానిజాలు బయటికి పోతాయని, ఎవరూ ఏమీ తెలియకుండా లేరన్నారు. ఇంత పెద్ద వ్యవస్థలో పొరపాట్లు జరుగుతూ ఉంటాయని, వాటిని సరిచేసుకుంటూ పోతామన్నారు. దళిత, గిరిజన, వెనకబడిన, మైనార్టీ వర్గాలకు ఓవర్సీస్‌ విద్య కోసం రూ.10 లక్షలు ఇచ్చేవారని, అది కూడా తక్కువ మందికేనని, దేశంలో ఏ ప్రభుత్వమూ ఇవ్వని విధంగా తాము లిమిట్‌ లేకుండా రూ.25 లక్షల ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌ ఇస్తున్నామన్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మహిళా విద్యార్థులకు మార్కులు తక్కువ వచ్చినా మంజూరు చేస్తున్నామన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఆవాసీయ విద్యకు ప్రాధాన్యం ఇస్తుందని, ప్రతి విద్యార్థి పైనా రూ.1.25 లక్షల మేరకు ఖర్చు చేస్తుందని, అదే మోడల్‌ను ఎస్సీ, ఎస్టీ, వెనకబడిన, మైనార్టీ వర్గాలకు ఇక్కడ అమలు చేస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఎంత డబ్బును ఖర్చు చేశామన్న వివరాలతో లక్ష పేజీలుండే పెన్‌ డ్రైవ్‌ను సభ్యులకు ఇవ్వబోతున్నామన్నారు.

గ్రూప్ 2 పరీక్షల్లో అవకతవకలు జరగలేదని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పారు. టీఎస్‌పీఎస్సీపై ఆరోపణలు చేస్తే తెలంగాణ యువత సహించబోదన్నారు. కొందరు కన్ఫ్యూజన్‌తో కోర్టుకు వెళ్లారని, ఆరోపణలన్నీ నిరాకరిస్తూ టీఎస్‌పీఎస్సీ కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసిందన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Chief Minister K Chandrashekar Rao has announced in the Assembly that the Telangana government is committed to filling 1.12 lakh job vacancies. It was promised during Telangana agitation that one lakh jobs would be provided in the new state. Now, KCR states that 1.12 lakh recruitments are being made.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి