క్రాస్ రోడ్డులో టిఆర్ఎస్: మోడీతో భేటీ, కెసిఆర్ కదలికలపై కన్నేశారు!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలు, తెలంగాణకు సహాయం విషయమై ప్రధాని మోడీతో ఆయన చర్చించారు. ప్రధానితో కెసిఆర్ అరగంటకు పైగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చి ఉంటాయని అంటున్నారు. టిఆర్ఎస్ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో చేరవచ్చునని చాలా రోజులుగా ఊహాగనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రధాని మోడీని కెసిఆర్ కలవడం మరోసారి చర్చకు వచ్చింది.
కొద్ది రోజుల క్రితం వరంగల్ ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భారీ విజయం నేపథ్యంలో టిఆర్ఎస్‌కు తెలంగాణలో తిరుగు లేకుండా పోయింది. కేంద్రంలో చేరిక విషయమై జిహెచ్ఎంసి ఎన్నికల తర్వాత తేలవచ్చునని గతంలో ఊహాగానాలు వినిపించాయి.

గ్రేటర్ ఎన్నికల్లో మేజిక్ ఫిగర్ కంటే తక్కువ సీట్లు వస్తే మజ్లిస్ పార్టీతో పొత్తు కోసం తెరాస ఎదురు చూస్తోందనే వాదనలు వినిపించాయి. అయితే గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ భారీ విజయం సాధించింది. మార్జిన్ ఫిగర్ కంటే 23 సీట్లు ఎక్కువగానే గెలుచుకుంది.
నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లోను భారీ విజయం సాధించింది. ఆ తర్వాత ఖమ్మం, వరంగల్ మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. ఈ రెండు ఎన్నికల తర్వాత... 2019 దాకా దాదాపు ఎలాంటి ఎన్నికలు లేవు. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ కేంద్రంలో చేరేందుకు మొగ్గు చూపే అవకాశాలు కొట్టిపారేయలేమని అంటున్నారు.
ఇప్పటికే తెలంగాణలో టిడిపిని బాగా దెబ్బతీశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ వంతు అంటున్నారు. తెలంగాణలో బిజెపికి అంతగా బలం లేదు. ఇటీవలి కాలంలో పుంజుకుంటోంది. మోడీతో కెసిఆర్ భేటీ అనంతరం కొన్ని ఊహాగానాలు వినిపించాయి. టిఆర్ఎస్ ఎన్డీయేతో టై అప్ కావొచ్చని ప్రచారం జరిగింది.
కేంద్రంలో టిఆర్ఎస్ కేబినెట్ బెర్తులను కోరవచ్చుననే వాదనలు కూడా వినిపించాయి. ఇవి గతంలోను వినిపించాయి. అయితే, ఈ వార్తలు రాజకీయ వర్గాల్లో గందరగోళాన్ని కలిగించాయి. అయితే, ఎన్డీయేలో తాము చేరమని తెరాస నేతలు, చేర్చుకునే అవకాశంలేదని బిజెపి నేతలు చెబుతున్నారు.
అయినప్పటికీ కెసిఆర్ కదలికల పైన కాంగ్రెస్, టిడిపి వంటి విపక్షాలు కన్నేశాయని అంటున్నారు. ఎన్డీయేలో చేరమని చెప్పినప్పటికీ.. ఆ దిశగా పావులు కదుపుతున్నారా? అని విపక్షాలు దృష్టి సారించాయి.
తెలంగాణకు కేంద్ర కేబినెట్ పునర్వ వ్యవస్థీకరణలో రెండు లేదా మూడు రావొచ్చునని, టిఆర్ఎస్ చేరితో వారికి అవకాశం దక్కవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే రాష్ట్రానికి ఫండ్స్ కోసం కూడా చేరేందుకు మొగ్గు చూపవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications