రాష్ట్రపతి ఎన్నికలా లేక 2024 సార్వత్రిక ఎన్నికలా? విపక్ష నేతలతో కేసీఆర్ భేటీ మర్మమేమిటో?
రాష్ట్రపతి ఎన్నికలా లేక 2024 సార్వత్రిక ఎన్నికలా? విపక్ష నేతలతో కేసీఆర్ భేటీ వెనుక దాగివున్న మర్మమేంటి అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయ పార్టీలలో ఆసక్తికర చర్చకు కారణమవుతుంది . తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ పర్యటన పై ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ ను గద్దె దించాలని సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఇప్పటికే అనేక మార్లు వివిధ రాష్ట్రాలలోని విపక్ష పార్టీల ముఖ్య నేతలతో సమావేశమైన కేసీఆర్ మళ్లీ తాజాగా పర్యటనలు సాగించడం వెనుక కారణాలపై అందరిలోనూ ప్రత్యేకమైన ఆసక్తి కనిపిస్తుంది.

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ తో కేసీఆర్ భేటీపై ఆసక్తి
దేశ పర్యటనకు వెళ్ళిన కెసీఆర్ మే 22న ఢిల్లీలోని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు. దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులతోపాటు పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. భారతీయ జనతా పార్టీకి సవాలు విసిరేందుకు 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజకీయ సమీకరణాలు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో రెండు ప్రాంతీయ పార్టీలు - ఆమ్ ఆద్మీ పార్టీ , మరియు టిఆర్ఎస్ మధ్య సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది.

కేసీఆర్ పర్యటనపై రెండు అనుమానాలు .. టార్గెట్ 2024 ఎన్నికలా? రాష్ట్రపతి ఎన్నికలా?
2024లో జరగనున్న భవిష్యత్ ఎన్నికల లక్ష్యంగా చేసుకొని సీఎం కేసీఆర్ దేశ పర్యటన సాగిస్తున్నారా అనుమానం కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీకి ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే . ఈ నేపథ్యంలో ఆయన పర్యటన ఆసక్తికరంగా మారింది. మరోవైపు జులైలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు ముందు ఈ కీలక పరిణామాలు చోటు చేసుకోవడంతో రాష్ట్రపతి ఎన్నికలలో ఏం జరుగుతుందో అన్న ఆసక్తి ప్రధానంగా కనిపిస్తుంది.

కేసీఆర్ పర్యటనతో రాష్ట్రపతి ఎన్నికలపైనా ఆసక్తి
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఐదేళ్ల పదవీకాలం జూలై 25తో ముగుస్తుంది. రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఉమ్మడి అభ్యర్థులను ఉంచాలని ప్రతిపక్షాలు తమ ఉద్దేశాన్ని సూచించాయి. ప్రతిపక్షాలు రాష్ట్రపతి ఎన్నికలకు ఉమ్మడి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. ఇక ఎన్డీయే అభ్యర్థిపై ప్రతిపక్షాల పోటీలో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయి.ఈ నేపథ్యంలోనే కేసీఆర్ జాతీయ పర్యటన రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలోనా అన్న చర్చ జరుగుతుంది. ఇక కెసీఆర్ తాజాగా దేశంలో సంచలనం జరుగుతుందని ప్రకటించటం కూడా అందుకు ఊతం ఇస్తుంది.

ప్రాంతీయ పార్టీల కీలక నేతలతో కేసీఆర్ భేటీలపై ఉత్కంఠ
భావసారూప్యత గల ప్రాంతీయ రాజకీయ నేతలను కెసిఆర్ కలుస్తున్న తీరు దేశ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. కేజ్రీవాల్‌ను కలవడానికి ముందు, టీఆర్ఎస్ చీఫ్ ఢిల్లీలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ మరియు ఉత్తరప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు అఖిలేష్ యాదవ్‌ను కూడా కలిశారు. మే 26న బెంగళూరులో మాజీ ప్రధాని దేవెగౌడ, జనతాదళ్ (సెక్యులర్) నేత హెచ్‌డి కుమారస్వామితో కేసీఆర్ భేటీ కానున్నారు.
ఆ తర్వాత నెలలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ కానున్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో పాటు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌లను కూడా కలవనున్నారు. ఆయన ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌లను కలిశారు.
విపక్ష నేతలను కలుస్తూ, వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలలో బిజెపిని ఢీ కొట్టడానికి ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారన్నది అందరిలో ఆసక్తికరంగా మారిన అంశం.