కేసీఆర్ జిత్తులమారి జిమ్మిక్కులు బంద్ పెట్టి ఆ పని చెయ్: వైఎస్ షర్మిల తీవ్రవ్యాఖ్యలు
తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 142వ రోజు ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగించిన వైఎస్ షర్మిల పాలమూరు జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైఎస్ షర్మిల పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో సీఎం కేసీఆర్ తీరును తప్పు పట్టారు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం లో ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగించిన వైయస్ షర్మిల డిండిచింతపల్లి లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తెలంగాణ సీఎం కెసిఆర్ పై నిప్పులు చెరిగారు.

కాళేశ్వరం మీద ఉన్న ప్రేమ పాలమూరు-రంగారెడ్డి మీద లేదు ఎందుకు?
కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్న ప్రేమ పాలమూరు-రంగారెడ్డి మీద లేదు ఎందుకు అంటూ ప్రశ్నించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులు వైయస్సార్ హయాంలోనే పూర్తయ్యాయని, కల్వకుర్తి ప్రాజెక్టులో మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయడంలో కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని వైయస్ షర్మిల విమర్శించారు. ఎనిమిది ఏళ్లలో కేసీఆర్ రాష్ట్రానికి చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు వైయస్ షర్మిల.

దుందుభి వాగుపై వైఎస్సార్ వంతెన నిర్మిస్తే కనీసం బస్సులు కూడా నడపలేరా?
డిండి చింతపల్లి ప్రజలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడం కోసం దుందుభి వాగుపై వైయస్సార్ వంతెన నిర్మిస్తే, కెసిఆర్ ఇప్పటి వరకు ఆ వంతెనపై బస్సులు కూడా నడపలేకపోతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉద్యమకారుడు అని తెలంగాణ ప్రజలు అధికారం అప్పగిస్తే సీఎం కేసీఆర్ పాలనను గాలికి వదిలేశారని వైయస్ షర్మిల నిప్పులు చెరిగారు. వైయస్సార్ నిర్మించిన బ్రిడ్జి వైయస్సార్ పేరు పెట్టాలన్న స్థానిక డిమాండ్ ను కూడా ప్రభుత్వం నెరవేర్చలేదని, ఖచ్చితంగా ప్రజల డిమాండ్లను నెరవేర్చాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

పాలమూరు రంగారెడ్డి కోసం వైఎస్సార్ తెలంగాణా పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది
అంతేకాదు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేంతవరకు వైయస్సార్ తెలంగాణ పార్టీ పోరాడుతూనే ఉంటుందని వైయస్ షర్మిల స్పష్టం చేశారు. రైతులతో పాటు భూనిర్వాసితుల తరఫున కూడా ఉద్యమిస్తామని షర్మిల వెల్లడించారు. కేసీఆర్ జిత్తులమారి జిమ్మిక్కులు బంద్ పెట్టి, ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

ఇది ప్రజాస్వామ్య పాలనా? రాచరిక పాలనా? ప్రశ్నించిన వైఎస్ షర్మిల
ఇక ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు 40 రోజులుగా విధులు బహిష్కరించి దీక్షలు చేస్తున్నా, కేసీఆర్ కు చీమ కుట్టినట్టు కూడా లేదు అని వైఎస్ షర్మిల అసహనం వ్యక్తం చేశారు. వీఆర్ఏల సమస్యలను పరిష్కరించడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందని మండిపడ్డారు. అటు ఆర్టీసీ కార్మికులతో వెట్టిచాకిరి చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య పాలనా? రాచరిక పాలనా? అంటూ వైఎస్ షర్మిల తెలంగాణ సర్కారు తీరుపై, సీఎం కేసీఆర్ పాలన పై నిప్పులు చెరిగారు.












Click it and Unblock the Notifications