CM KCR కఠిన నిర్ణయం..వాళ్ళ ఆశలు అడియాశలే!!
వచ్చే ఎన్నికల టికెట్ల విషయంలో కేసీఆర్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. దీంతో టికెట్ల విషయంలో బోలెడు ఆశలు పెట్టుకున్న కీలక నాయకులు డైలమాలో పడ్డారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ గత రెండు దఫాలుగా తిరుగులేని నాయకుడిగా తెలంగాణా ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణ రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికలలో సైతం విజయ దుందుభి మోగించాలని ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికీ క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై, ప్రజలలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న మద్దతుపై ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుంటున్న కేసీఆర్ వచ్చే ఎన్నికల టికెట్ల విషయంలో అనేక కీలక నిర్ణయాలను తీసుకుంటున్నట్టుగా సమాచారం.

వచ్చే ఎన్నికల టికెట్ లపై కేసీఆర్ కఠిన నిర్ణయం
ఇప్పటికే నియోజకవర్గస్థాయిలో ఎమ్మెల్యేల పనితీరుపై అధ్యయనం చేస్తున్న కేసీఆర్ వచ్చే ఎన్నికలలో విజయం సాధించలేని ఎమ్మెల్యేకి, స్థానికంగా మంచి పేరు లేని ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వబోరని చర్చ జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 25 మంది ఎమ్మెల్యేలు ఈ కోవకు చెందిన వారని, వారికి టికెట్ ఇచ్చేది లేదని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే సమయంలో వచ్చే ఎన్నికలలో ఫ్యామిలీ ప్యాకేజీలకు నో చెప్పాలని కెసిఆర్ కఠిన నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.

ఒకే కుటుంబం నుండి ఇద్దరికి టికెట్లు ఇస్తారా? కేసీఆర్ నిర్ణయం ఇదే
చాలామంది కీలక నాయకులు తమకు నియోజక వర్గాల్లో ఉన్న పట్టుతో ఒకే కుటుంబం నుండి ఇద్దరికి టికెట్లు అడుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి టికెట్లు ఇవ్వడానికి కెసిఆర్ విముఖత వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం. రాష్ట్రంలో ఉన్న అగ్ర కులాలకు చెందిన సీనియర్ నాయకులు చాలా వరకు ఈ మేరకు కేసిఆర్ పై ఒత్తిడి చేస్తున్నారని తెలుస్తుంది. అయితే ఎంత ఒత్తిడి చేసినప్పటికీ ఒకే కుటుంబానికి రెండు టికెట్లు ఇస్తే, రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన నాయకులు కూడా అదే బాటలో రెండు టికెట్లు అడుగుతారని, ఒత్తిడి పెడతారని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.

సర్వే ఆధారంగానే టికెట్లు ఇవ్వనున్న కేసీఆర్
ఈ క్రమంలోనే ఏ కుటుంబానికి రెండు టికెట్లు ఇవ్వబోమని గట్టిగా తేల్చి చెబుతున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు వచ్చే ఎన్నికలలో ఎవరి బలం ఎంత అన్నది సర్వే రిపోర్ట్ ఆధారంగా తేల్చి టికెట్ ఇస్తామని, పనితీరును బట్టి అవకాశం ఉంటుందని కెసిఆర్ తేల్చి చెబుతున్నట్టు సమాచారం. ఎంపీ స్థానాలకు పోటీ చేసే చాలామంది, ఎమ్మెల్యేలుగా తమ వారికి తమ కుటుంబంలోని వారికి అవకాశం ఇవ్వాలని, పెట్టుబడి పెట్టి, పెద్ద ఎత్తున ప్రచారం చేసి గెలిపించుకునే బాధ్యత తమదేనని కెసిఆర్ కు చెబుతున్నప్పటికీ, ఈ విషయాలపై కేసిఆర్ విముఖంగా ఉన్నట్టు సమాచారం.

వచ్చే ఎన్నికల్లో విజయం.. కేసీఆర్ కు ప్రతిష్టాత్మకం
ఎందుకంటే వచ్చే ఎన్నికలు తెలంగాణ సీఎం కేసీఆర్ భవిష్యత్తును మాత్రమే కాక జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆవిర్భవించిన బిఆర్ఎస్ పార్టీ భవిష్యత్తును కూడా తేలుస్తాయి. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించకుంటే బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది, ఈ క్రమంలో కేసీఆర్ వచ్చే ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఇక గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి తెలంగాణాలో ఎన్నికలు జరగనున్నాయి.

కేసీఆర్ కఠిన నిర్ణయాలకు కారణం ఇదే
ఒక పక్క కేంద్రంలోని బీజేపీ తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికలపై ఫోకస్ చేస్తుంది. ఇక బండి సేన దూకుడుగా ముందుకు వెళ్తుంది. మరో పక్క కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి, వైఎస్ షర్మిల, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి వారు వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నారు. చాలా పెద్ద ఎత్తున పోటీ ఉండే అవకాశం ఉండటంతో ఇక ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ టికెట్ల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.












Click it and Unblock the Notifications