టీటీడీపీపై కేసీఆర్ అసహనం, మోత్కుపల్లి నిప్పులు
హైదరాబాద్: అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ సభ్యుల తీరు పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. నలభై ఏళ్ల చట్ట సభళ చరిత్రలో ఇలాంటి సంఘటనలు చూడలేదన్నారు. కేసీఆర్ సోమవారం అసెంబ్లీలో మాట్లాడారు.
ఉద్దేశపూర్వకంగా సభను అడ్డుకోవడం సంస్కారం కాదన్నారు. చట్టసభల హుందాతనాన్ని కాపాడాలని సూచించారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు వెనుకాడటం లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధికి నిర్మాణాత్మక సూచనలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
అవసరమైతే బడ్జెట్ సమావేశాలను పొడగించేందుకు సిద్ధమని చెప్పారు. అజెండాల్లో లేని అంశాలను తెరపైకి తెస్తున్నారన్నారు. సభను ఎలా జరపాలో తమకు తెలుసని సభ జరగకుండా అడ్డుపడితే సహించేది లేదన్నారు. అధికార పక్షం సభ్యులు తప్పు చేసినా చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు.
సమస్యల పైన సభలో చర్చ జరగాలనేది ప్రభుత్వం అభిమతమన్నారు. సభా సమయం వృథా చేయడం ఏ పక్షానికి మంచిది కాదన్నారు.త టీడీపీ సభ్యులు తీరు మార్చుకోకుంటే గుణపాఠం తప్పదన్నారు.

టీడీపీ సభ్యులు చేసిన పనికి ఇప్పుడు తీసుకున్న చర్య చిన్నదని, ఇంకా పెద్ద శిక్ష విధించాలన్నారు. వచ్చే సెషన్ కైనా వారు మారాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. జాతీయ గీతాన్ని అవమానించిన వారు ఎవరైనా క్షమాపణ చెప్పాలన్నారు.
కేసీఆర్ పైన మోత్కుపల్లి నిప్పులు
కేసీఆర్ లాంటి దొంగలు అడుగడుగునా దళితులను మోసం చేస్తున్నారని తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం ఇందిరా పార్కు వద్ద మోత్కుపల్లి ఒకరోజు దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
మోసాలను ఎదుర్కునే ధైర్యం టీడీపీకే ఉందన్నారు. అసెంబ్లీలో కేసీఆర్ దొరతనం చూపిస్తున్నారన్నారు. ప్రభుత్వానికి చావు డప్పు ఎలా కొట్టాలో తాను చూపిస్తానన్నారు. కేసీఆర్ గొంతు కూడా మూగబోయే సమయం వస్తుందన్నారు. సర్కార్‌పై పోరాటం కొనసాగుతుందన్నారు.












Click it and Unblock the Notifications