పదేళ్లపాటు కెసిఆరే అధినేత, టి సిఎం: కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి అధ్యక్షుడే వర్కింగ్‌లో ఉన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకని పంచాయతీరాజ్, ఐటి శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు మరో పదేళ్లు పార్టీని, ప్రభుత్వాన్ని నడుపుతారని చెప్పారు.
కెటిఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతారని ప్రచారం జరుగుతోందని ప్రశ్నించగా.. కెటిఆర్ పై విధంగా స్పందించారు. కెసిఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రతీ కార్యకర్తతోపాటు నేనూ కోరుకుంటున్నానని.. కెసిఆర్‌కు పార్టీ, ప్రభుత్వం తప్ప వేరే కార్యక్రమం ఏదీ లేదని చెప్పారు.
మరో పది పదిహేనేళ్లపాటు కెసిఆరే పార్టీని, ప్రభుత్వాన్ని నడపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆయనకు 24 గంటలు ప్రభుత్వం, పార్టీ తప్ప వేరే పనేమీ ఉండదని మంత్రి కెటి రామారావు తెలిపారు.

కాగా, మంగళవారం మంత్రి పద్మారావుతో కలిసి కెటిఆర్ ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను ఎదుర్కొనేందుకు టిఆర్ఎస్ ఎప్పుడూ సిద్ధమేనని అన్నారు. నామినేటెడ్ పదవులపై ప్లీనరీలో స్పష్టత వస్తుందని తెలిపారు. సాంకేతిక కారణాలతోనే నామినేటెడ్ పదవుల భర్తీ ఆలస్యమైందని చెప్పారు.
ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడు ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్లీనరీ కాబట్టి భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతోందని చెప్పారు. ఎంపీ కేశవరావు నేతృత్వంలో తీర్మానాల కమిటీ పని చేస్తోందని తెలిపారు.












Click it and Unblock the Notifications