చంద్రబాబుకు ఆహ్వానం: బెజవాడకు సతీసమేతంగా కెసిఆర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆయుత చండీయాగానికి ఆహ్వానించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నిర్ణయించుకున్నారు. అయితే, స్వయంగా చంద్రబాబుకు ఆహ్వాన పత్రం అందించాలనేది కెసిఆర్ నిర్ణయం. ఇందుకుగాను కెసిఆర్ సతీసమేతంగా విజయవాడకు వెళ్లి చంద్రబాబును ఆహ్వానిస్తారని అంటున్నారు.
ప్రస్తుతం ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీ నుంచి తిరిగి రాగానే ప్రత్యేక హెలికాప్టర్‌లో కెసిఆర్ సతీసమేతంగా వెళ్లి చంద్రబాబును కలుస్తారని అంటున్నారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.
మంగళవారంనాడు కెసిఆర్ ఢిల్లీ వెళ్లారు. బుధవారం కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కూతురి పెళ్లి విందులో పాల్గొంటారు. గురువారంనాడు శరద్ పవార్ 78వ జన్మదినం ఉఁది. ఈ సందర్భంగా ఆయనను కలిసి కెసిఆర్ శుభాకాంక్షలు తెలియజేస్తారు.

అదే విధంగా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఠాకూర్‌ను కలిసి కెసిఆర్ హైకోర్టు విభజనపై చర్చలు జరుపుతారు. ముఖ్యమంత్రి వెంట ఆయన ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. గురువారం సాయంత్రం కెసిఆర్ తిరిగి హైదరాబాద్ వస్తారు.
ఇదిలావుంటే, ఇటీవల చంద్రబాబు హైదరాబాద్ వచ్చినప్పుడు సచివాలయంలో కలవాలని తొలుత కెసిఆర్ భావించారు. అయితే, అలా కలిసి ఆయుత చండీయాగానికి ఆహ్వానిస్తే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తప్పుడు సంకేతాలు వెళ్తాయనే భావనతో ఆయన వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications