ఏపీలో పోటీ తక్కువ, కోటా పెంచండి: సుష్మకు కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణకు హజ్ యాత్రికుల కోటాను పెంచాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ఆదివారం నాడు లేఖ రాశారు. తెలంగాణలో 1,223 స్లాట్లకుగాను 15,419 మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు.
తెలంగాణలో ఒక్కో స్లాట్‌కు 12 మంది పోటీ పడుతున్నారని, అదే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక స్లాట్‌కు ఇద్దరు మాత్రమే పోటీ పడుతున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణకు మరో 2 వేల స్లాట్లు పెంచేలా చర్యలు తీసుకోవాల్సిందిగా సుష్మా స్వరాజ్‌కు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ నుండి హజ్ వెళ్లే యాత్రికుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో అనుమతులు రాలేదన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మొత్తం ఏపీ, తెలంగాణల్లోని 6043 మంది యాత్రికులకు అనుమతి లభించిందని, ఈ సంవత్సరం కోటాను 4945కి తగ్గించడం తమకు విస్మయం కలిగించిందన్నారు.
ఈసారి మొత్తం కోటాలో 2700 ఏపీకి, 2245 తెలంగాణకు కేటాయించారన్నారు. తెలంగాణ నుండి హజ్ యాత్రకు బాగా డిమాండ్ ఉందన్నారు. తెలంగాణలో ఒక్కో సీటుకు 12 మంది, హైదరాబాదులో అయితే 23 మంది పోటీ పడుతున్నారన్నారు. తెలంగాణలో డిమాండ్ దృష్ట్యా తమకు 2000 స్లాట్లు పెంచాలని కోరారు.












Click it and Unblock the Notifications