ఖమ్మం కాంగ్రెస్ సభ వేళ.. బీఆర్ఎస్ కు బిగ్ షాక్!!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన అనుచరగణంతో చేరనున్నారు. ఇప్పటికే ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలోకి త్వరలో భారీ చేరికలు ఉంటాయని, బిజెపి, బీఆర్ఎస్ నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరతారని వెల్లడించారు.
ఇక ఆయన చేసిన వ్యాఖ్యలకు తగ్గట్టు బీఆర్ఎస్ పార్టీకి పలువురు నేతలు గుడ్ బై చెబుతున్నారు. భద్రాద్రి జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఆయన అనుచరులు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అంతేకాదు ఇల్లందు నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో ఒక జడ్పిటిసి, 56 మంది సర్పంచులు, 26 మంది ఎంపీటీసీలు కూడా బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.

రేపు ఖమ్మంలో జరగనున్న జన గర్జన సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇదిలా ఉంటే రేపు సాయంత్రం ఖమ్మంలో జరిగే తెలంగాణ జన గర్జన సభ ద్వారానే ఎన్నికల శంఖరావం పూరిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు ప్రకటించారు. ఇప్పటికే బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు.

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ బహిరంగ సభకు రానుండటంతో ఖమ్మం అంతా కాంగ్రెస్ జెండాలు, తోరణాలు, ఫ్లెక్సీలు, కటౌట్లతో ముస్తాబవుతోంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క107 రోజులుగా సుమారు 1221 కిలోమీటర్లు నిర్వహిస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో జరిగే పీపుల్స్ మార్చ్ ముగింపు సభలో, అదే వేదికపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో తన అనుచరగణంతో చేరనున్నారు.












Click it and Unblock the Notifications