వైఎస్.. కేసీఆర్‌కు పోలికే లేదు: కోట్లు దోచుకుంటున్నారంటూ ఏకిపారేసిన షర్మిల
ఖమ్మం: తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని పెట్టబోతున్నామని వైఎస్ షర్మిల ప్రకటించారు. ఖమ్మంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన ప్రజాసంకల్ప సభలో షర్మిల భారీ సంఖ్యలో హాజరైన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఉద్యమాల గుమ్మం ఖమ్మం అంటూ ఆమె తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

సరిగ్గా 18 ఏళ్ల క్రితం వైఎస్ ఇదే రోజు.
సరిగ్గా 18 ఏళ్ల క్రితం ఏప్రిల్ 9న తెలంగాణలోని చేవెళ్లలో అసాధారణ కార్యక్రమం వైఎస్సార్ ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రారంభమైందని షర్మిల గుర్తు చేశారు. రాజన్న సంక్షేమ పాలన తిరిగి తేవాలని అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ ముద్రను తిరిగి ప్రారంభిస్తామన్నారు. తెలంగాణలో రాజకీయ పార్టీని పెట్టబోతున్నామని ప్రకటించారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించిన ఘనత వైఎస్ దేనని అన్నారు.

ఇది కేసీఆర్ అవినీతి కాదా?
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు 30వేల కోట్లతో తలపెడితే.. దాని తల తోకను తీసేసి రీడిజైన్ పేరుతో కేసీఆర్.. ఆ ప్రాజెక్టును లక్షా 30వేల కోట్లకు తీసుకెళ్లాడని ఆరోపించారు. ఇది అవినీతి కాదా? అని ప్రశ్నించారు. ఈ అవినీతిలో కేసీఆర్ వాటాలు, కమీషన్లు ఎంత అని ప్రశ్నించారు. ఈ విధంగా ప్రశ్నించడానికే మన పార్టీ అవసరం అని షర్మిల వ్యాఖ్యానించారు. రైతు రుణ మాఫీ చేస్తానన్న కేసీఆర్.. ఆ హామీని నిలబెట్టుకోలేదని షర్మిల మండిపడ్డారు. కేసీఆర్ దృష్టిలో కౌలు రైతు రైతే కాదని ధ్వజమెత్తారు. లక్షల కోట్లు అప్పులు చేసి జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. వీటిపై ప్రశ్నించడానికే మన పార్టీ అవసరమని చెప్పారు. వైఎస్ పావల వడ్డీకి రుణాలిస్తే.. కేసీఆర్ సున్నా వడ్డీ అని చెప్పినా.. 12 శాతం వడ్డీ పడుతుందని కొందరు మహిళలు చెప్పారని తెలిపారు. వైఎస్ ఫీజు రీఎంబర్స్ మెంట్ 100 శాతం చేస్తే.. కేసీఆర్ సర్కారు రూ. 30వేలే ఇస్తోందని అన్నారు.

ఏమైంది కేసీఆర్ సారూ అంటూ షర్మిల
కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు.. ఏమైంది కేసీఆర్ సారూ.. ఇంటికో ఉద్యోగం.. నిరుద్యోగ భృతి అన్న కేసీఆర్.. వాటి ఊసేత్తడం లేదని మండిపడ్డారు. లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్, 108 అంబులెన్స్, ఆరోగ్యశ్రీ తెచ్చింది వైయస్సారేనని షర్మిల గుర్తు చేశారు. వైఎస్ 46లక్షల పక్కా ఇళ్లు కట్టిస్తే.. కేసీఆర్ ఎన్ని ఇళ్లు కట్టారని ప్రశ్నించారు. వైఎస్ మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని.. 12 శాతం రిజర్వేషన్లు ఇస్తానన్న కేసీఆర్.. ఏమయ్యారని ప్రశ్నించారు. వైఎస్ హయాంలో.. వైట్ కార్డులు, పింఛన్లు, చేనేత కుటుంబాలకు రుణ విముక్తి చేశారని.. కేసీఆర్ హయాంలో కొత్తగా ఒక్క వైట్ కార్డు, పెన్షన్ లేదని చెప్పారు. కార్పొరేషన్లకు నిధులు కూడా లేవన్నారు.
పేదలకు భూములు కూడా లేవని అన్నారు.

ఆ ఘనత సీఎం కేసీఆర్‌దే...
వైఎస్.. పేదలకు, గిరిజనలకు భూములను పంచారని.. దళితులకు 3 ఎకరాలు ఇస్తానన్న కేసీఆర్ హామీ ఏమైందని షర్మిల ప్రశ్నించారు. వైఎస్.. కేసీఆర్ కు ఎన్నో తేడాలున్నాయని.. అసలు పోలికే లేదని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా వైఎస్ పాలన సాగిందన్నారు. వైఎస్ లాంటి నాయకుడు ఉన్నాడా? అని ప్రశ్నించారు. దేశంలో సచివాలయంలో అడుగుపెట్టని ఘనత సీఎం కేసీఆరేనని దుయ్యబట్టారు. ఇప్పుడేమో సచివాలయాన్నే కూల్చేశాడన్నారు. కేసీఆర్ పాలనలో ఏ వర్గం కూడా ఆనందంగా లేదని అన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల గురించి ఆలోచన ఉందా? అని షర్మిల ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications