లైట్ బీర్లు అందుబాటులోకి: తాగుబోతుల సంఘం నేతకు మందుబాబుల సన్మానం
మంచిర్యాల: లైట్ బీర్లు దొరకడం లేదంటూ పోరాటం చేసిన తాగుబోతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొట్రంగి తరుణ్ విజయం సాధించాడు. మంచిర్యాల జిల్లాలోని పలు వైన్ షాపులు, బార్లలో కింగ్ ఫిషర్ లైట్ బీర్లు అందుబాటులో లేకపోవడంతో మందుబాబులు ఇబ్బందులు పడుతున్నారంటూ సోమవారం జిల్లా ఎక్సైజ్ అధికారికి తరుణ్ వినతి పత్రం అందించిన విషయం తెలిసిందే.
రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే తమకు బీర్లు లభించకపోవడం ఇబ్బందిగా మారిందని లెటర్ ప్యాడ్ మీద రాతపూర్వకంగా విన్నవించాడు. ఈ నేపథ్యంలో స్పందించిన ఎక్సైజ్ అధికారులు తెల్లారేసరికి అంటే మంగళవారం ఉదయం నటికి వైన్ షాపులు, బార్లలో కింగ్ ఫిషర్ లైట్ బీర్లు అందుబాటులోకి తేవడం గమనార్హం.

ఈ క్రమంలో పలు వైన్స్, బార్లు తిరుగుతున్న తరుణ్‌ను పలువురు మందుబాబులు అభినందించడంతోపాటు శాలువతో సత్కరించారు. కేవలం 24 గంటల్లోపే తమ డిమాండ్ ను నెరవేర్చడంపై తాగుబోతుల సంఘం హర్షం వ్యక్తం చేసింది.
అంతకుముందు, సోమవారంనాడు మందుబాబుల దాహార్తి తీర్చే ఆ బీర్లు దొరకడం లేదని.. ఆ జిల్లాలోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లలో కింగ్ ఫిషర్ బీర్లు దొరకడం లేదని కుట్రంగి తరుణ్ అనే యువకుడు జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి ఎక్సైజ్ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఆ బీర్లు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తాగుబోతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడైన తరుణ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
బీరు బాధితుల బాధలు తెలుసుకుని తగిన చర్యలు తీసుకోవాలని మంచిర్యాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌కు వినతి పత్రం అందించారు. జిల్లాలోని వైన్స్, బార్లలో కింగ్ ఫిషర్ లైట్ బీర్లు దొరకడం లేదని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎండతీవ్రతలు ఎక్కువగా అవుతున్న క్రమంలో యువకులు, పెద్దలు బీరుతో దాహం తీర్చుకునేందుకు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పుకొచ్చాడు.
అంతేగాక, తమ జిల్లాతోపాటు కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ఆసిఫాబాద్ వంటి జిల్లాల్లో కూడా కింగ్ ఫిషర్ లైట్ బీర్లు లభ్యం కావడం లేదని తరుణ్ పేర్కొన్నాడు. ఈ లైట్ బీర్లు తాగడం వల్ల మత్తు తక్కువ సమయం ఉంటుందని, ఆ తర్వాత తమ పనులను తాము చేసుకోగలమని చెబుతున్నాడు. స్ట్రాంగ్ బీర్లు తాగడంతో కడుపులో మంట, తీవ్రమైన తలనొప్పి, వాంతులు వంటి వస్తున్నాయని పేర్కొన్నాడు. అందుకే కింగ్ ఫిషర్ లైట్ బీర్లు అందుబాటులో ఉంచాలని అధికారులను కోరాడు. ఈ నేపథ్యంలోనే వెంటనే స్పందించిన అధికారులు లైట్ బీర్లు అందుబాటులోకి తెచ్చారు.












Click it and Unblock the Notifications