'ఉద్యమంలో ప్రజల్నికొట్టించిన తలసానికి మంత్రిపదవి'
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం సమయంలో నాయకత్వం వహించిన ఆచార్య కోదండరాంను మాట్లాడించేందుకు సమయం లేదు కానీ, ఉద్యమం సమయంలో తెలంగాణ ప్రజల వీపులు పగులగొట్టించిన తుమ్మల నాగేశ్వర రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లకు మంత్రి పదవులు ఇచ్చేందుకు తెరాసకు సమయం దొరికిందని భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి సోమవారం మండిపడ్డారు.
ఆయన తెరాస పైన, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన బీజేపీ విస్తృతస్థాయి సమావేశంలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించిన ప్రజలు కారుకు బ్రేకులు వేశారన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పిన కేసీఆర్, అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల భర్తీ విషయం మాటనే మర్చిపోయారని ఎద్దేవా చేశారు.

రోజు పత్రికా ప్రకటనలకే పరిమితమైన కేసీఆర్ వ్యాఖ్యల పైన విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. బంగారు తెలంగాణ అన్న కేసీఆర్.. ఇప్పుడు బంగారు కుటుంబం వైపు దృష్టి సారించారని విమర్శించారు.
వేణుగోపాలచారి పిటిషన్ కొట్టివేత
ఏపీ పునర్వ్వవస్థీకరణ చట్టంలో తెలంగాణకు ఇచ్చిన చట్టబద్దమైన హామీల అమలుకు చర్యలు తీసుకునేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు సోమవారం కొట్టివేసింది. దీనిని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎన్ వేణుగోపాలాచారి దాఖలు చేశారు. వ్యాజ్యం దాఖలు చేయడానికి పిటిషనర్‌కు ఉన్న అర్హతపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది.
మరోవైపు, మంత్రి జగదీశ్వర్ రెడ్డి పైన లోకాయుక్త విచారణ ప్రారంభించింది. సోమవారం నాడు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, సంపత్ కుమార్ లోకాయుక్త ఎదుట హాజరయ్యారు. అనంతంర వచ్చే నెల 28వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ శాఖలకు లోకాయుక్త ఆదేశించింది.












Click it and Unblock the Notifications