కాళేశ్వరం అవినీతిపై కాంగ్రెస్ సీబీఐ విచారణ కోరంది అందుకే: కిషన్ రెడ్డి తీవ్రవ్యాఖ్యలు!!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సూచనలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగిన అవినీతిపై సిబిఐతో ఎందుకు విచారణ జరిపించడానికి చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతిపై సీబీఐ విచారణ కోరుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ రోజు హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన కిషన్ రెడ్డి బీఆర్ఎస్ కు, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు మేలు చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని విమర్శించారు. తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని బిజెపి తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పూర్తిస్థాయి మెజారిటీ లేదని, అందుకే బీఆర్ఎస్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని ఆయన ఆరోపించారు. ఎంఐఎం మధ్యవర్తిత్వంతో మాజీ సీఎం ప్రస్తుత సీఎంల మధ్య అవగాహన కుదిరిందని కిషన్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర మంత్రులను విమర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నిశ్వబ్దంగా ఎందుకున్నారో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
మేడిగడ్డ, కాళేశ్వరం నిర్మాణం తదితర కుంభకోణాలపై దర్యాప్తు చేయించడంలో కాంగ్రెస్ జాప్యం చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాలపై గోప్యంగా ఉంటూ, తన అసమర్థతను బయటపెట్టిందన్నారు. కేంద్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం లేఖ ఎందుకు రాయడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. ఊచలు లెక్క పెట్టాల్సిన కేసీఆర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుందని కిషన్ రెడ్డి ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అవినీతిపై కేసీఆర్ ప్రభుత్వం సిబిఐ విచారణకు అంగీకరించలేదని గుర్తు చేసిన ఆయన రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సిబిఐ రాష్ట్రంలోకి రాకుండా జీవో తెచ్చారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏదో స్పష్టం చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం లేఖ రాస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ పై 48 గంటలలోగా కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశించేలా మేము రికమండ్ చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications