గాలి కూతురు పెళ్లి రూ.500 కోట్లతోనా: రెవెన్యూపై కేసీఆర్‌కు కోదండ సూచన
హైదరాబాద్: స్థూల ఆదాయంలో 30 శాతం నల్ల ధనం ఉందని అంచనా ఉందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ఆచార్య కోదండరాం బుధవారం నాడు చెప్పారు. పాలకులు అనుసరించిన విధానంతోనే దేశంలో నల్ల ధనం పెరిగిందని ఆయన వ్యాఖ్యానించారు.
రూ.500, రూ. 1000 నోట్ల రద్దు ప్రభావం జన జీవనం పైన పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లధనం నివారణ మాత్రం ఆవశ్యమని ఆయన చెప్పారు.
1978లోపెద్ద నోట్లు రద్దు చేసినా సామాన్య ప్రజలపై పెద్దగా ప్రభావం చూపలేదని, ప్రస్తుతం వాడుకలో ఉన్న నగదు మొత్తంలో 86 శాతం పెద్ద నోట్లే ఉండటం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. సామాన్య ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు కేంద్రం నగదు చెలామణి విస్తృతం చేయాలని కోరారు.
కేసీఆర్ ప్రభుత్వం తమ రెవెన్యూ తగ్గిందని చెప్పడం పైనా కోదండరాం స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం తమ ఆదాయం చూసుకోవడం తప్పు కాదన్నారు. అదే సమయంలో రియల్ ఎస్టేట్, ఎక్సైజ్‌లను ఆదాయ వనరులుగా చూడవద్దని హితవు పలికారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలను అవలంభించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక అభివృద్ధికి ఉమ్మడి రాష్ట్రంలోని విధానాలను అనుసరించడం ఏమాత్రం సరికాదన్నారు. రియల్ ఎస్టేట్, ఎక్సైజ్ ఆదాయం పైన ఆధారపడవద్దన్నారు.
కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి రూ.500 కోట్లతో పెళ్లి చేస్తున్నాడని, అలాంటి వారి పైన చర్యలు తీసుకోవాలని కోదండరాం డిమాండ్ చేశారు. పేద ప్రజలు బ్యాంకుల ముందు కష్టాలు పడుతుంటే బడాబాబులు బకాయిల రద్దు చేయడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications