చేస్తారా లేదా: కేసీఆర్‌కు మళ్లీ కోదండ హెచ్చరిక, కేంద్రంతో హరీష్ హ్యాపీ
హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వానికి మరోసారి తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ఆచార్య కోదండరాం మంగళవారం నాడు హెచ్చరికలు జారీ చేశారు. అసెంబ్లీ ఎదుట తాము మౌనదీక్ష చేస్తామని చెప్పారు. రైతు సమస్యల పైన అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు.
నాకు ముందే తెలుసు: కేసీఆర్‌కు షాక్‌పై కోదండ, సంబరాలు చేసుకున్నారు
ఇందుకు సంబంధించి తాము ప్రభుత్వానికి మెమోరాండం ఇస్తామని చెప్పారు. ప్రభుత్వం వ్యవసాయ విధానం ప్రకటించాలని డిమాండ్ చేశారు. భూమి తీసుకునే రైతులకు బదులుగా భూమి ఇస్తేనే లాభమని చెప్పారు. గత ఏడాది పంట నష్టానికి ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదన్నారు.
ప్రభుత్వం వెంటనే రైతులకు బ్యాంకు రుణాలు ఇప్పించాలన్నారు. మూడో విడత రుణమాఫీ ఇప్పటి వరకు చెల్లించలేదన్నారు. రైతులకు వ్యవసాయ శాఖ సహాయకరంగా లేదని ఆరోపించారు. కరువు మ్యాన్యువల్ సవరణ చేస్తారా లేదా చెప్పాలని నిలదీశారు.

నాబార్డుతో ఒప్పందం కుదుర్చుకున్న కేంద్రం
కేంద్రం, నాబార్డు మధ్య ఒప్పందం నవశకానికి నాంది అని మంత్రి హరీష్ రావు అన్నారు. దేశంలో 99 ప్రాజెక్టుల నిర్మాణానికి నాబార్డుతో ఒప్పందం కురిదినట్లు హరీష్ రావు తెలిపారు. ఇందులో తెలంగాణలో 11 ప్రాజెక్టుల నిర్మాణానికి నాబార్డు ద్వారా 7వేల కోట్ల నిధులు వస్తాయన్నారు. దీనిలో 2వేల కోట్ల గ్రాంటు రూపంలో ఇవ్వాలని కోరినట్లు చెప్పారు.
కేంద్ర జలవనరులశాఖ, నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ అథారిటీ, నాబార్డుల మధ్య మంగళవారం నాడు అవగాహన ఒప్పందం కుదిరింది. దేశంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేసే క్రమంలో భాగంగా ఈ ఒప్పందం జరిగింది.
దీంతో దేశవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న 99 ప్రాజెక్టులకు నిధుల కొరత తీరనుంది. ఢిల్లీలో జరిగిన ఈ ఒప్పంద కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. ఈ ఒప్పందం కారణంగా తెలంగాణలో దేవాదుల ఎత్తిపోతల పథకంతో సహా రాష్ర్టానికి సంబంధించిన 11 ప్రాజెక్టులకు చేయూత లభించనుంది.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడారు. నాబార్డుతో ఒప్పందం దేశంలోని పెండింగ్ ప్రాజెక్టులకు ఉపయోగపడుతుందన్నారు. ఒప్పందంతో రాష్ట్రంలో చిట్టచివరి ఆయకట్టుకు సాగునీరు ఇవ్వొచ్చన్నారు. ఈ సమావేశానికి తనను పిలిచినందుకు కేంద్ర మంత్రి ఉమాభారతికి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం సహకారం సంతోషకరమన్నారు.












Click it and Unblock the Notifications