మద్యం వ్యాపారులకు కొత్త నిబంధనలు, టైమింగ్స్..!!
మద్యం వ్యాపారులకు కొత్త నిబంధనలు. అమ్మకాల వేళలు ఖరారు. ఇక నుంచి సాయంత్రం సమయాల్లోనే మద్యం అమ్మకాలు జరగాలి. బెల్టు షాపులకు అనుమతి లేదు. నియోజకవర్గం బయటి వారు టెండర్లలో పాల్గొనేందుకు లేదు. ఎవరైనా తాజా నిబంధనలు ఉల్లంఘిస్తే వారే నష్టపోతారు. ఇప్పుడు తెలంగాణలో మద్యం షాపులకు టెండర్లు ఖరారు వేళ అధికార పార్టీ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని మద్యం వ్యాపారులకు జారీ చేసిన హుకుం. ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది.
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో సంచలనానికి తెర తీసారు. తనకు మంత్రి పదవి రాకపోవటం పైన కొంత కాలంగా చేస్తున్న రాజకీయ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇక, ఇప్పుడు ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం పాలసీ పైన ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ దుకాణాల ఖరారు కోసం ఎక్సైజ్ శాఖ టెండర్లు ఆహ్వానించింది.

ఈ సమయంలోనే తన మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి లిక్కర్ దుకాణాల నిర్వహణ పైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హుకుం జారీ చేసారు. టెండర్లు వేసి షాపులు దక్కించుకునే వారు ఇక నుంచి ఊరి బయటే వైన్స్‌లు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. లిక్కర్ దుకాణాల ఖరారు.. నిర్వహణ ఎలా ఉండాలో నిబంధనలు ఖరారు చేస్తూ రాజగోపాల్ రెడ్డి సూచనల మేరకు ఆయన అనుచరులు ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం సమర్పించారు.
మునుగోడు ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంతోపాటు బెల్ట్ షాపుల నిర్మూలన, మహిళల సాధికారత, యువత మద్యం పట్ల బానిసలు కాకూడదనే ఆలోచనతో ఈ నిబంధనలు అమలు చేయాలని కోరుతున్నట్లు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వెల్లడించారు. ఇక నుంచి మద్యం దుకాణాల్లో లిక్కర్ సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకే విక్రయించాలని సూచించారు. ఊరిబయటే వైన్ షాపులు ఉంచాలి.. అనుబందంగా సిట్టింగ్ నడపకూడదు.. బెల్ట్ షాపులకు మద్యం అమ్మవద్దు.. షాపులు దక్కించుకున్న ఓనర్స్ సిండికేట్ కాకూడదు.. వంటి నిబంధనలను విధించారు.
ఈ షరతులు పాటించని వారు మునుగోడులో టెండర్స్ వేసి నష్టపోవద్దని.. ఈ నిబంధనలు పాటించే వారు మాత్రమే మునుగోడు నియోజకవర్గంలో వైన్స్‌ల కోసం టెండర్లు వేయాలని సూచించారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి నిబంధనల పైన ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది












Click it and Unblock the Notifications