కొండా సురేఖ పదవి ఊస్ట్.. కుడా చైర్మన్ గా గుండు సుధారాణికి బూస్ట్... మారిన సమీకరణాలు!
రాజకీయాల్లో ఒకరి పోస్టు ఊడితే మరొకరికి అవకాశం వచ్చే సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పద్మశాలి కులానికి చెందిన మంత్రి కొండా సురేఖపై బర్తరఫ్ వార్తల నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన గుండు సుధారాణికి మళ్లీ లాభం చేకూరింది. కొండా సురేఖ పుణ్యమా అని గుండు సుధారాణి నక్కతోక తొక్కింది.
గుండు సుధారాణిని కుడా చైర్మన్ గా చేసిన సీఎం రేవంత్ రెడ్డి
పద్మశాలి సామాజిక వర్గానికి, బీసీకి చెందిన కొండా సురేఖను మంత్రి పదవి నుండి తప్పిస్తున్న క్రమంలో అదే సామాజిక వర్గానికి, బీసీకి చెందిన మరొక మహిళా నాయకురాలికి లబ్ది జరిగింది. వరంగల్ జిల్లాకు చెందిన గుండు సుధారాణిని కుడా చైర్మన్ గా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో కూడా గుండు సుధారాణికి ఇదే తరహాలో అనుకోకుండా అనేక పదవులు వరించాయి.

గతంలోనూ సుధారాణిని వరించిన పదవులు
గుండు సుధారాణి గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో 2002 నుంచి 2004 వరకు టీటీడీ బోర్డు సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించారు. 2005 నుంచి 2010 వరకు వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్‌లో తెలుగుదేశం పార్టీ తరఫున ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు. 2010లో రాజ్యసభ సభ్యురాలిగా కూడా ఆమెకు అనుకోకుండా అవకాశం వచ్చింది. ఆమె కూడా ఊహించని విధంగా రాజ్యసభకు చంద్రబాబు అవకాశం ఇచ్చారు. రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికై ఆరేళ్లపాటు పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం వహించారు.
కొండాను తప్పిస్తే బీసీల నుండి ఒత్తిడి
కేసీఆర్ హయాంలో 2021 మేలో గ్రేటర్ వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్‌గా ఎన్నికై ప్రస్తుతం కూడా ఆ పదవిని నిర్వహిస్తున్నారు. 2024లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరినా మేయర్ పదవిలో కొనసాగుతోంది. కొండా సురేఖ మంత్రి పదవి నుంచి తప్పుకుంటే అదే వర్గం నుంచి మరో నాయకురాలికి అవకాశం కల్పించాలనే ఒత్తిడి పార్టీలో ఉంటుంది.
పద్మశాలీ సామాజికవర్గం నుండి గుండు సుధారాణికి అవకాశం
కాబట్టి ఉమ్మడి వరంగల్‌లో పద్మశాలి సామాజిక వర్గం రాజకీయంగా బలంగా ఉండటం వల్ల కొండా సురేఖను తప్పిస్తూ, గుండు సుధారాణికి కీలక పదవిని అప్పగించారు. వరంగల్ లో పద్మశాలీల నుండి వ్యతిరేకత ఎదురుకాకుండా చెక్ పెట్టారు. ఈ తాజా పరిణామాలు సురేఖ పదవిని ఊస్ట్ చేస్తే గుండు సుధారాణికి బూస్ట్ ఇచ్చింది.












Click it and Unblock the Notifications