బీసీ నినాదంతో.. కొండా దంపతుల కొత్త పార్టీ... జోరుగా చర్చ!
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఊపందుకుంటున్నాయి. మంత్రివర్గం నుండి కొండా సురేఖకు ఉద్వాసన పలుకుతున్న క్రమంలో కొండా దంపతుల రాజకీయ భవితవ్యంపైన చర్చ జరుగుతోంది. మొదట నుండి వివాదాస్పదులే అయినప్పటికీ సుదీర్ఘ రాజకీయ అనుభవం, బలమైన కేడర్, వరంగల్ లో బలమైన పట్టు, ఉన్న మంత్రి కొండా సురేఖ, కొండా మురళీ దంపతులు నూతన రాజకీయ శక్తిగా ఆవిర్భవించేందుకు సమాయత్తమవుతున్నారనే వార్తలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి.
50 శాతానికి పైగా ఉన్న బీసీ సామాజిక వర్గాల కోసం కొండా పార్టీ వ్యూహం
బీసీ వర్గాల హక్కులు, ఆత్మగౌరవమే ప్రధాన అజెండాగా వారు ఈ నిర్ణయం తీసుకోబోతున్నారని వారి అనుచరులు, శ్రేయోభిలాషులు చెబుతున్నారు. రాష్ట్ర జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీ సామాజిక వర్గాల ఆత్మగౌరవ జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా వారు వ్యూహ రచన చేస్తున్నారని సమాచారం. 40 ఏళ్ల రాజకీయ అనుభవం, పుష్కలమైన ప్రజా మద్దతు, అంగబలం, ఆర్థిక బలం తమకు అనుకూలంగా ఉన్నాయని కొండా దంపతులు భావిస్తున్నారు.

బీసీ మేధావులతో చర్చలు.. అందరినీ ఏకతాటి మీదకు తెచ్చే ప్రయత్నం
ప్రస్తుతం బీసీ మేధావులు, శ్రేయోభిలాషులు, మద్దతుదారులతో విస్తృత స్థాయిలో సమాలోచనలు కొనసాగుతున్నాయి. కొండా దంపతుల నిర్ణయం బీసీల ఏకీకరణకు ఇది మంచి అవకాశం అని వారి మద్దతుదారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో మెజారిటీ జనాభా ఉన్న బీసీ వర్గాలను ఒకే వేదికపైకి తెచ్చి, వారికి తగిన రాజకీయ ప్రాధాన్యం కల్పించేందుకు ఈ చర్య దోహదపడుతుందని అంటున్నారు.
కవిత, తీన్మార్ మల్లన్న, కోదండరామ్ ల బాటలో కొండా కపుల్
కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలలో టికెట్లు దక్కక నిరాశలో ఉన్న సమర్థులైన నాయకులకు అవకాశం కల్పించి, వారిని గెలిపించుకునే వ్యూహంతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. కోదండరామ్, కవిత, తీన్మార్ మల్లన్న వంటి నాయకులు స్వంత వేదికల ద్వారా గుర్తింపు పొందినట్లే, దశాబ్దాలుగా ప్రజాదరణ ఉన్న తాము కూడా స్వతంత్రంగా ముందుకు రావాలనే ఆలోచన కొండా దంపతుల్లో ఉందని వారి సన్నిహితులు చెబుతున్నారు.
రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు కూడా ప్రణాళికలు
ప్రకటన అనంతరం నేరుగా ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకునేందుకు రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు కూడా ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరి కొండా దంపతులు కొత్త రాజకీయ పార్టీ పెడితే వారి వెంట నడిచేవారు ఎందరు? వారు ఈ ప్రయత్నంలో సక్సెస్ అవుతారా అన్న చర్చ కూడా సాగుతుంది. అయితే, దీనిపై కొండా కుటుంబం నుండి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఈరోజు మధ్యాహ్నం కొండా సురేఖ ప్రెస్ మీట్ నిర్వహించనున్న వేళ ఆమె ఏం చెప్తారు అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. .













Click it and Unblock the Notifications