నా బర్తరఫ్ చెల్లదు.. మారని కొండా సురేఖ ధిక్కార స్వరం, కాసేపట్లో బహిరంగ లేఖ!
మంత్రి పదవి నుంచి తనను బర్తరఫ్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు. "నా బర్తరఫ్ చెల్లదు. వివరణ తీసుకోకుండా ఎలా చేస్తారు? నా కూతురు వ్యాఖ్యలకు నన్నెలా బాధ్యురాలిని చేస్తారు?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
అధిష్ఠానానికి నేరుగా అందించిన లేఖను మీడియాకు విడుదల చేయనున్న కొండా సురేఖ
పదేళ్లుగా తన కుమార్తె సుస్మిత టికెట్ కోసం ప్రయత్నిస్తోందని, కడియం శ్రీహరి తన కూతురు కావ్యకు టికెట్ ఇప్పించుకోలేదా? సుస్మిత అడిగితే తప్పేంటి? అని ప్రశ్నించారు. తన భర్తతో కలిసి తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. మరికాసేపట్లో బహిరంగ లేఖ విడుదల చేయనున్నారు. అధిష్ఠానానికి నేరుగా అందించిన లేఖను మీడియాకు కూడా విడుదల చేయనున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆరోపణ
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందని ఆరోపించిన సురేఖ, "నేను ఎంఎల్ఏగా కొనసాగాలా వద్దా అనే విషయంతోపాటు మిగతా అంశాలన్నీ నా భర్తతో మాట్లాడుకున్నాక, చర్చించాకే బయటకు చెబుతాను అన్నారు. రేవంత్ కుటుంబ విషయాలు అధిష్ఠానానికి తెలియదా? అని ప్రశ్నించారు. తన మాజీ ఓఎస్డీ సుమంత్ ఏ తప్పు చేయలేదు అన్నారు. అతన్ని అనవసరంగా బద్నాం చేస్తున్నారని విమర్శించారు.
అసలు వివాదం రేవంత్ టికెట్ ప్రకటన వల్లే కదా
బీసీలను బ్యాలెన్స్ చేస్తున్నామన్నట్లుగా తాజాగా నియామకాలు జరిగాయని, వారికి శుభాకాంక్షలు తెలిపారు. మా కార్యకర్తలకు మేమేంటో తెలుసు అన్నారు. పరకాలలో సీఎం చేసిన వ్యాఖ్యలే ఈ మొత్తం వివాదానికి కారణం అని కొండా సురేఖ అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం ఎక్కడా అభ్యర్థులను ప్రకటించలేదు. పరకాలలో ఎందుకు ప్రకటించారు? చెప్పాలని కొండా సురేఖ ప్రశ్నించారు.
మంత్రిగా ఎన్నో చెప్పుకోలేనివి ఉన్నాయి.. త్వరలో మాట్లాడతా అన్న కొండా సురేఖ
మంత్రిగా ఉన్నప్పుడు చాలా చెప్పుకోలేని విషయాలు జరిగాయని, మంత్రిగా చేసిన ప్రమాణానికి కట్టుబడి బయటకు చెప్పలేదని సురేఖ వ్యాఖ్యానించారు. ఆమె తదుపరి చర్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. అయితే మరికాసేపట్లో బహిరంగ లేఖ విడుదల చేస్తానని చెప్పిన కొండా సురేఖ మీడియా సమావేశం కూడా నిర్వహిస్తానని చెప్పారు. అయితే భవిష్యత్ ప్రణాళికపైన కొండా మురళి తాను చర్చించుకున్న తర్వాత చెప్తామని పేర్కొన్నారు.













Click it and Unblock the Notifications