కొండగట్టులో పెద్ద హనమాన్ జయంతి ఉత్సవాలు ప్రారంభం: భక్తులకు సూచనలు
కరీంనగర్: ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయం పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం నుంచి మే 14వ తేదీ వరకు మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఆలయంలోని యాగశాలలో గురువారం అంకురార్పరణ కార్యక్రమం నిర్వహించారు.
పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలకు సుమారు 2 లక్షల మంది దీక్షాపరులు తరలివచ్చే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచనా వేశారు. కొండగట్టు పరిసరాల్లో 55 తాత్కాలిక, 64 శాశ్వత మరుగుదొడ్లను సిద్ధం చేసినట్లు ఈవో వెంకటేశ్, ఏఈవో బుద్ధి శ్రీనివాస్, ఏఈ లక్ష్మణ్ రావు తెలిపారు. 1500 నాయీ బ్రాహ్మణులను అందుబాటులో ఉంచారు. పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఇప్పటికే ప్రతిరోజూ వేలాది మంది భక్తులు అంజన్న దర్శించుకునేందుకు వస్తున్నారు.

మరోవైపు, కొండగట్టు దిగువన, పైన ఏడు ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు తాగునీరు అందించేందుకు ఐదు మొబైల్ ఆటోలు, 28 చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. కొత్త కోనేరులో ఎప్పటికప్పుడు నీళ్లను నింపడంతోపాటు 120 షవర్లు ఏర్పాటు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కొండపై సెల్‌ఫోన్ సిగ్నల్‌కు అంతరాయం ఏర్పడకుండా జియోతోపాటు 4 రోజులపాటు తాత్కాలికంగా ఎయిర్‌టెల్ సేవలు అందించడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
అంజన్న స్వామి వారి ప్రసాదం విక్రయానికి 12 కౌంటర్లు ఏర్పటు చేయడంతోపాటు టిక్కెట్ల రీఇష్యూ, అక్రమ వసూళ్లపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఆలయ ఈవో వెంకటేశ్ తెలిపారు. రాత్రి వేళల్లో కొండగట్టుకు వచ్చే దీక్షాపరులు ప్రమాదాల బారిన పడకుండా వారి బ్యాగులకు, వెనుకవైపు దుస్తులకు రేడియం స్టిక్కర్లు అంతించనున్నారు. దీంతో దూరం నుంచే వారిని వాహనదారులు గుర్తించేందుకు అవకాశం ఉంటుంది.

భక్తులు మార్గమధ్యలో సేద తీరడానికి ప్రధాన రహదారికి పక్కన పలుచోట్ల తడికల పందిళ్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. భక్తులకు ఉచిత అన్నదానం ఏర్పాటు తోపాటు ఆలయ ప్రాంగణంలో నిత్యం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేలా 16 బృందాలను సిద్ధం చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, కొండపైకి వాహనాలను అనుమతించరనే విషయాన్ని భక్తులు గమనించాలని పోలీసులు సూచించారు.












Click it and Unblock the Notifications