ఆ అసెంబ్లీ టికెట్ కోసం రేవంత్ రెడ్డికి రూ. 10 కోట్లు, 5 ఎకరాలు: మనోహర్ రెడ్డిపై కాంగ్రెస్ వేటు
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేసిన ఆ పార్టీ నేత కొత్త మనోహర్ రెడ్డిపై అధిష్టానం చర్యలు తీసుకుంది. మహేశ్వరం అసెంబ్లీ టికెట్ కోసం బడంగ్‌పేట మేయర్ చిగురింత పారిజాతారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి రూ. 10 కోట్లు తీసుకున్నారని, ఐదు ఎకరాలు రాయించుకున్నారని మనోహర్ రెడ్డి ఇటీవల ఆరోపించారు.
సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు సాక్ష్యాలతో సహా బయటపెడతానంటూ వ్యాఖ్యానించారు. మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన మనోహర్ రెడ్డి.. ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన జనగర్జన సభలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సభలోనే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

అయితే, పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మనోహర్ రెడ్డి చేసిన ఆరోపణలు రాజకీయంగా కలకలం సృష్టిస్తున్నాయి. దీంతో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు రంగారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ చల్లా నర్సింహా రెడ్డి బుధవారం ప్రకటించారు. రాష్ట్రస్థాయి నాయకులపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
మనోహర్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసేలా ఉన్నాయన్నారు నర్సింహా రెడ్డి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు మనోహర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. ఏదైనా సమస్య ఉంటే పార్టీ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో లేదంటే ఏఐసీసీ పెద్దలతో మాట్లాడాలని సూచించారు. పార్టీకి నష్టం జరిగేలా ఎవరు వ్యవహరించకూడదన్నారు.
కాగా, కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చేరికలు పెరిగిన విషయం తెలిసిందే. దీంతో పార్టీలో పాత, కొత్త నాయకులు మధ్య విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. తమకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఆశిస్తున్నారు. అయితే, అలా జరగకపోవడంతో విభేదాలు బయటపడుతున్నాయి.












Click it and Unblock the Notifications