చంద్రబాబు ప్రచారం మాకు లాభమే, షబ్బీర్‌కి రెస్ట్ కావాలి: పార్టీలకు కెటిఆర్ సవాల్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి మేయర్ పీఠంపై కూర్చోకపోతే రాజీనామా చేస్తానని మరోసారి రాష్ట్ర మంత్రి కెటి రామారావు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ 100 సీట్లు అని కుట్ర పూరితంగా మాట్లాడుతున్నారని, తాను మేయర్ పీఠం టిఆర్ఎస్‌కు రాకుంటే రాజీనామా చేస్తానని చెప్పినట్లు చెప్పారు.
షబ్బీర్ అలీ ముచ్చట తీర్చేందుకు కూడా ప్రయత్నిస్తామని కెటిఆర్ అన్నారు. షబ్బీర్ అలీకి రిటైర్ కావాలని ఉన్నట్లుంది, ప్రజలు ఆయడ్ని ఇంటింటికి పంపిస్తే మంచిదని అన్నారు. కాంగ్రెస్, బిజెపి, టిడిపిలు తమ అభ్యర్థి మేయర్ కాకుంటే రాజీనామా చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీలా నేరుగా స్పష్టం చేయాలని అన్నారు.
గ్రేటర్ మేయర్ పదవి టిఆర్ఎస్ పార్టీదేనని మరోసారి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే లేరని, హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారని చెప్పారు. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి జానారెడ్డిలు పార్టీలు మారితే లేని తప్పు.. కిందిస్థాయి నేతలు మారితే తప్పవుతుందా అని ప్రశ్నించారు. అభివృద్ధి బాటలో నడుస్తున్న తమ పార్టీలో చేరేందుకు వారు మొగ్గుచూపుతున్నారని అన్నారు.

ఈరోజు కూడా ఓ పెద్ద జాయినింగ్ ఉందని, అది అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుందని అన్నారు. 23మంది మైనార్టీలకు టికెట్లు ఇచ్చామని, టిఆర్ఎస్.. మజ్లిస్ తో కలిసి పోటీ చేస్తుందనే తప్పుడు ఆరోపణలు చేస్తుందని బిజెపిపై మండిపడ్డారు. కేంద్రం ఏం చేసిందో చెప్పి ఓట్లు అడగాలని బిజెపిని కోరారు. మతం బూచీగా చూపెట్టి ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.
టికెట్ల విషయంలో కాంగ్రెస్, టిడిపి, బిజెపి కార్యాలయాల ముందు ఘర్షణ వాతావరణం కనిపిస్తోందని, అర్ధనగ్న ప్రదర్శలు జరుగుతున్నాయని అన్నారు. అయితే తమ పార్టీ కార్యాలయం వద్ద అలాంటివేమీ లేవని, ప్రశాంతంగా ఉందని చెప్పారు.
టిడిపి అధినేత, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నగరంలో ప్రచారం చేయడం ఆయన విజ్ఞతకే వదిలేస్తామని అన్నారు. రోడ్ షోలు నిర్వహిస్తే ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని అన్నారు. ప్రజాస్వామ్యం దేశంలో చంద్రబాబు ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చని కెటిఆర్ అన్నారు. చంద్రబాబు ప్రచారం తమ పార్టీకి లాభమే చేకూర్చుతుందని అన్నారు.
జూన్ 12పారిశ్రామిక విధాన ప్రకటించిన నాటి నుంచి ఉపాధి అవకాశాలు పెరిగాయని చెప్పారు. తాము ఐటికి చేసేందెక్కువ చెప్పుకున్నది తక్కువ అని కెటిఆర్ అన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్టీ అధ్యక్షుడితో చర్చించి మేయర్ పదవిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications