కేటీఆర్.. తండ్రీకొడుకులు రాజీనామా లేఖలతో సిద్ధంగా ఉండండి: ఆ సవాల్ స్వీకరించిన బండి సంజయ్
తెలంగాణ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిని మించి ఒకరు ఇప్పుడే సవాళ్లు ప్రతిసవాళ్లతో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. తెలంగాణా రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రావాలని టీఆర్ఎస్ పార్టీ, ఈసారి ఎలాగైనా టీఆర్ఎస్ ను గద్దె దించాలని బీజేపీ శతవిధాలా ప్రయత్నాలు సాగిస్తున్నాయి.

కేటీఆర్ సవాల్ స్వీకరించామని ప్రకటించిన బండి సంజయ్
తెలంగాణాలో పొలిటికల్ వార్ రసవత్తరంగా మారింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమి నిధులు ఇచ్చిందో చెప్పాలని బిజెపి నాయకులకు సవాల్ విసిరారు మంత్రి కేటీఆర్. మంత్రి కేటీఆర్ సవాల్ కు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. కేంద్రం తెలంగాణకు 1.68 లక్షల కోట్లు నిధులు మాత్రమే ఇచ్చిందని, తప్పని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ మంత్రి కేటీఆర్ చేసిన సవాల్ కు బండి సంజయ్ దీటుగా సమాధానం ఇచ్చారు.

డేట్, టైం మీ ఇష్టం .... మేం రెడీ అన్న బండి సంజయ్
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చింది అనేది పూర్తి వివరాలు చెప్పడానికి తమ నాయకులు సిద్ధంగా ఉన్నారని, తేదీ, వేదిక మీరు చెబితే తాము రెడీగా ఉన్నట్టుగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు. కేటీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలేనని పేర్కొన్న బండి సంజయ్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు ఇప్పటివరకు కేంద్రం ఎన్ని రాష్ట్ర అభివృద్ధి నిధులు ఇచ్చిందో చెప్పేందుకు తాము రెడీగా ఉన్నామని పేర్కొన్నారు. అన్ని లెక్కలు పక్కాగా చెప్తామని తెలిపారు.

రాజీనామా లేఖలతో రెడీగా ఉండాలంటూ సవాల్
రాజీనామా లేఖతో కేటీఆర్ సిద్ధంగా ఉండాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రంలో పాలన శ్రీలంకను తలపిస్తోందని మండిపడిన బండి సంజయ్, త్వరలోనే యూపీ నుంచి బుల్డోజర్లు వస్తాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన అంతం కాబోతుంది అంటూ పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ తండ్రీకొడుకులు ఇద్దరు రాజీనామా లేఖలతో సిద్ధంగా ఉండాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు.

కేసీఆర్, కేటీఆర్ లపై బండి సంజయ్ ఫైర్
ఇక హైదరాబాద్లో జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ బాలిక సామూహిక అత్యాచార ఘటనపై మాట్లాడిన బండి సంజయ్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగితే సాంకేతికత, డ్రోన్లు ఏమయ్యాయని కేటీఆర్ ను నిలదీశారు. యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన లక్ష్మణ్ కు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వంపై, కేటీఆర్, కెసిఆర్ లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ చేసిన సవాల్ ను స్వీకరిస్తున్నాం అంటూ వెల్లడించారు. టైము, డేటు ఫిక్స్ చేసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications