చావు డప్పు కొట్టాల్సింది పోయి.. పెళ్లి డీజే చేశారు - కేటీఆర్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితికి చావు డప్పు కొట్టాలని.. కానీ గవర్నర్ ప్రసంగం పెళ్లిలో డీజే కొట్టినట్లుగా ఉందని విమర్శలు గుప్పించారు. ఈ మేరకు అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడిన తరుణంలో.. మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం గాంధీ భవన్‌లో కాంగ్రెస్ నేతల ప్రెస్‌మీట్‌లా ఉందని ఎద్దేవా చేశారు.
ఆర్ఆర్ ట్యాక్స్, కాంగ్రెస్ కమీషన్లను తట్టుకోలేక తెలంగాణలో నిర్మాణ రంగం కుదేలయిందని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో పరిస్థితి దారుణంగా ఉంటే.. గవర్నర్‌తో చెప్పించిన ప్రతి పదం అబద్ధం, ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట అసత్యం, ప్రతి వాక్యం పచ్చి మోసం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదో ఉద్ధరించిందన్నట్టు గవర్నర్ ప్రసంగం సాగిందని మండిపడ్డారు. 420 హామీల్లో ఒక్క హామీ నెరవేర్చకుండా లక్షల కోట్ల అప్పు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గవర్నర్ మందలిస్తారని అనుకుంటే.. గాంధీ భవన్‌లో కార్యకర్తలా ప్రసంగించారని ఎద్దేవా చేశారు.

అంతే కాకుండా రుణమాఫీ పూర్తయిందని గవర్నర్ చేత కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పించిందని ఆరోపించారు. తెలంగాణలోని ఏ గ్రామంలో కూడా 25 శాతం నుండి 30 శాతానికి మించి రుణమాఫీ జరగలేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంతూరుకు కూడా వెళ్లి చూద్దామని సవాల్ చేశారు. ఈ ప్రసంగంతో గవర్నర్ స్థాయిని తగ్గించారని విమర్శించారు. గవర్నర్ ప్రసంగంలో రైతులకు భరోసా ఇచ్చే ఒక్క మాట కూడా లేదన్నారు.
ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు సాంత్వన, భరోసా ఇచ్చే మాట రాలేదని అన్నారు. రేవంత్ రెడ్డి చేతకానితనం వల్ల వేలాది ఎకరాలకు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని మండిపడ్డారు. ఇప్పటికే 480 పైచీలుకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వాపోయారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల వరిధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ అయిందని గవర్నర్ ప్రసంగంలో చెప్పించారని.. 14 నెలల కాలంలో ఇదంతా చేశారా అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ హయాంలోనే వరిధాన్యంలో తెలంగాణ ముందు నిలిచిందన్నారు. లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంటే రైతులను ఓదార్చడానికి ఒక్క మంత్రి, ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే రావడం లేదని ఆయన అన్నారు. ఊళ్లల్లోకి కాంగ్రెస్ నేతలు వస్తే ప్రజలు, రైతులు తరిమి తరిమి కొడుతున్నారని అన్నారు. ఒక్క కొత్త ప్రాజెక్టుకు కూడా ఈ ప్రభుత్వం ఇటుక పెట్టలేదని ఆయన ఫైర్ అయ్యారు. ఢిల్లీకి మూటలు పంపడానికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందని.. దావోస్ ద్వారా లక్షా డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని డబ్బా కొట్టారని విమర్శలు గుప్పించారు.












Click it and Unblock the Notifications