ఢిల్లీలో ఒక నాయుడు, గల్లీలో ఒక నాయుడు: వెంకయ్య, చంద్రబాబులపై కెటిఆర్
వరంగల్ : కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులపై తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటి రామారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఒక నాయుడు, గల్లీలో ఒక నాయుడు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు
ప్రభుత్వంపై ప్రతిపక్షాలు పసలేని విమర్శలు చేస్తున్నాయని, ప్రతిపక్షాల అర్థం లేని విమర్శలను తాము పట్టించుకోబోమని ఆయన అన్నారు. ఉనికి కోసమే జెండాలను పక్కనబెట్టి ప్రతిపక్షాలు ఒక్కటయ్యాయని ధ్వజమెత్తారు. అధికారం కోల్పోయేసరికి అసహనం ఎక్కువైందని విమర్శించారు. అసెంబ్లీలో రచ్చ కాదు, చర్చ జరగాలని తాము కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
అసెంబ్లీలో రైతు ఆత్మహత్యలపై చర్చ జరిగితే చిన్న సూచన కూడా చేయకపోవడం దారుణమన్నారు. వరంగల్ ఉప ఎన్నికలో ప్రజలు టీఆర్‌ఎస్‌కే పట్టం కడుతారని ధీమా వ్యక్తం చేశారు. 15 నెలల్లో ఏం చేశామో ఉప ఎన్నికలో చెప్తామని తెలిపారు. 60 ఏళ్లలో ఏం చేశారో వాళ్లు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

మావోయిస్టుల ఆర్థిక, సామాజిక ఎజెండానే తమ ఎజెండా అని, సాయుధ పోరాటం తమ ఎజెండాలో లేదని ఆయన అన్నారు. తుపాకీ మోతలేని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రభుత్వం కోరుకుంటోందని చెప్పారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని ఆయన విమర్శించారు.
తెలంగాణ రక్తం చిందకూడదనేదే ప్రభుత్వ లక్ష్యమని కెటిఆర్ అన్నారు. విదేశాలు తిరుగుతున్న ప్రధాని మోడీకి తెలంగాణ కనిపించడం లేదని అన్నారు. కెసిఆర్ 15 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని కొనసాగించాలని తాను, హరీష్ కోరుకుంటున్నట్లు ఆయన ఓ ప్రముఖ తెలుగు టీవి చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. మజ్లీస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్ధీన్‌తో తనకు వ్యక్తిగతమైన విభేదాలు ఏవీ లేవని స్పష్టం చేశారు.
హరీష్ రావుకు, తనకు మధ్య రాజకీయ వైరం ఏదీ లేదని, తామిద్దరం ఎవరి పనుల్లో వాళ్లం తీరిక లేకుండా ఉన్నామని, అంతా కెసిఆరే అయినప్పుడు తామిద్దరి మధ్య వైరం ఎలా ఉంటుందని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications