ఫార్ములా ఈ కార్ రేసు కేసుపై స్పందించిన కేటీఆర్, హరీశ్
ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో ఏసీబీ కేసు నమోదు చేయడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఫార్ములా ఈ రేస్‌లో కుంభకోణం జరిగిందని అంటున్నారని.. అయితే, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చ చేపట్టాలని కేటీఆర్ కోరారు. ఫార్ములా ఈ కార్ రేసుపై అన్ని వాస్తవాలు వివరిస్తామని చెప్పారు.
ఫార్ములా ఈ కార్ రేస్‌కు సంబంధించిన కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిపై తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అసెంబ్లీలో ఈ అంశంపై చర్చ చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

మరోవైపు, కేటీఆర్‌పై కేసు నమోదు విషయంపై మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అసెంబ్లీలో ప్రస్తావించారు. ప్రశ్నిస్తే దబాయిస్తున్నారని.. అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. కేటీఆర్ మీద అక్రమ కేసులు పెడుతున్నారు. రాష్ట్ర ఇమేజ్ కోసం ప్రయత్నిస్తే కేసులు పెట్టారని హరీశ్ రావు ఆరోపించారు.
ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏ1గా కేటీఆర్
ఫార్మాలా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్‌పై విచారణకు ఇటీవల వర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చిన క్రమంలో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని సీఎస్ శాంతి కుమారి ఏసీబీకి లేఖ రాశారు.
ఫార్మాలా ఈ కార్ రేసు పూర్వాపరాలు, అనుమతి లేకుండానే హెచ్ఎండీఏ ఒప్పందం చేసుకోవడ, ఆర్బీఐ అనుమతి లేకుండా రూ. 46 కోట్ల మేర విదేశీ కరెన్సీ చెల్లించడం వంటి వ్యవహారాలపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఫిర్యాదు మేరకు ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయం విధితమే. ఇందులోనూ కేటీఆర్ తోపాటు పురపాలక శాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, చీఫ్ ఇంజినీర్ ను బాధ్యులుగా పేర్కొన్నారు.
అధికారులపై విచారణకు ప్రభుత్వం గతంలోనే అనుమతి ఇచ్చింది. ఇక, కేటీఆర్‌పై కేసు నమోదుకు గవర్నర్ నుంచి అనుమతి కోరగా.. సుమారు నెల రోజుల తర్వాత ఇటీవలే అనుమతి లభించింది. దీంతో తాజాగా, ఏసీబీ అధికారులు కేటీఆర్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక ఈ కేసు విచారణను మరింత వేగవంతం చేయనున్నారు.
కేటీఆర్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదైంది. 13(1)ఏ, 13(2) పీసీ యాక్ట్, 409, 120బీ కింద కేసు నమోదు చేశారు. కేబినెట్ అనుమతి, ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండానే ఈ వ్యవహారంలో నిధులు చెల్లించినట్లు కేటీఆర్‌పై అభియోగాలు మోపారు. కేటీఆర్ ఆదేశాలతోనే అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఏసీబీ అభియోగాలు మోపింది. కేబినెట్ అనుమతి లేకుండా సొంత నిర్ణయం తీసుకున్నారంటూ కేటీఆర్‌పై కుట్ర, చీటింగ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications