బీజేపీ రూ. 50 కోట్లంటే.. కాంగ్రెస్ ఎంతిస్తోందో: పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్ సెటైర్లు
వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్న వేళ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీడియాలో చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. సిద్ధరామయ్య వ్యాఖ్యల ప్రకారం ఒక్కో ఎమ్మెల్యేకు బీజేపీ రూ.50 కోట్లు ఆఫర్ చేస్తోందని, తెలంగాణలో ఒక్కో ఎమ్మెల్యేకు కాంగ్రెస్ ఎంత ఆఫర్ చేస్తుందో అన్న ఆశ్చర్యం కలుగుతోందని కేటీఆర్ చురకలంటించారు.
మీరు ఎంత ధర నిర్ణయించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రశ్నించారు కేటీఆర్. ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్ల మొత్తం ఆర్ఆర్ఆర్, కల్కి 2898ఏడీ కంటే ఎక్కువగా ఉంటుందా? అని కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యేల చేరికల పర్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌లోకి ఇప్పటి వరకు తొమ్మిదిమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరారు. మరోవైపు ఒకట్రెండు రోజుల్లో కూడా మరో ఐదారుగురు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
According to Karnataka CM, BJP is offering ₹ 50 Crore per MLA!!
— KTR (@KTRBRS) July 13, 2024
Wonder what the Congress is offering in Telangana
Kya Rate Decide Kiya Aap Ne @RahulGandhi Ji?
After all, Telangana Mein “RR-Tax” Ki Collections #RRR Aur #KALKI2898AD Se Bhi Zyada Hain Na ? pic.twitter.com/ujkHBZuqi8
పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్, స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి కడియం శ్రీహరి, భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావ్ మాత్రమే కాంగ్రెస్‌లో చేరారు. అప్పటికే దానం నాగేందర్‌తో సహా పలువురి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు స్పీకర్‌ను విన్నవించడంతోపాటు హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు.
అయితే, లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లోకి చేరికల్లో జోరు పెరిగింది, దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య తగ్గుతూ వస్తోంది. తాజాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం సాయంత్రం పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లడం గమనార్హం. దీంతో ఈయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యేల చేరికలపై ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు.












Click it and Unblock the Notifications