దత్తత తీసుకున్నవాళ్లు చేసిందేమీ లేదు: చంద్రబాబుపై కెటిఆర్ పరోక్ష విసురు
కరీంనగర్: పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్న నేతలు చేసిందేమీ లేదని తెలంగాణ మంత్రి కెటి రామారావు పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని విమర్శించారు. రైతుల ఆత్మహత్యలపై మాట్లాడే హక్కు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఎప్పుడో కోల్పోయాయని ఆయన అన్నారు.
రుణమాఫీ కోసం రూ. 17 వేల కోట్లు ఇచ్చామని, అనవసరంగా ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నాయని ఆయన చెప్పారు. తాము ప్రజలకు జవాబుదారీగా ఉంటామే గానీ ప్రతిపక్షాలకు కాదని ఆయన స్పష్టం చేశారు. గ్రామజ్యోతి కార్యక్రమంలో గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. గ్రామాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యమే కీలకమని అన్నారు. గ్రామాలను అభివృద్ధి చేసుకున్నప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమైతదని మంత్రి చెప్పారు.

పథకాల పేరుపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారని, పథకాల పేర్లను కాదు జరుగుతున్న అభివృద్ధి చూడాలని ఆయన అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో నేడు జిల్లా పరిస్థితిపై ఆయన సమీక్ష సమావేశం జరిపారు. ఈ సమావేశంలో మంత్రి ఈటెల రాజేందర్, జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో రైతు సమస్యలు, విద్యుత్ సరఫరా, తాగునీరు లభ్యతపై మంత్రులు సమీక్ష నిర్వహించారు.
తెలంగాణ వస్తే ఏమొస్తుందని ఎగతాళి చేసిన వారికి 14 నెలల్లో అభివృద్ధి చేసి చూపించామని, సంక్షేమ రంగానికి రూ. 28 వేల కోట్లు ఖర్చు చేస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు. అర్హులందరికీ పెన్షన్లు ఇస్తున్నామని, కాంగ్రెస్ హయాంలో సంక్షేమం కోసం కేవలం రూ. 800 కోట్లు ఖర్చు పెట్టారని, పింఛన్ల కోసం రూ. 4,500 కోట్లు ఖర్చు చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని కెటిఆర్ చెప్పారు.
అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లులను చెల్లిస్తున్నామని, త్వరలో డబుల్ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభిస్తామని, రాబోయే ఎండాకాలం నుంచి వ్యవసాయానికి పగటిపూట 9 గంటల విద్యుత్ ఇస్తామని, 60 ఏళ్ల పాలనలో చేతగానితనం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications