కాంగ్రెస్‌ను ఉపేంక్షించం, టిడిపితో ఎన్టీఆర్‌కు క్షోభ: కేసీఆర్‌కు పాలేరు కానుకే
హైదరాబాద్: పాలేరు ఉప ఎన్నికల్లో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గెలుపు తథ్యమని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ ఉప ఎన్నికకు తుమ్మల నాగేశ్వరరావు నామినేషన్ వేయనున్న సందర్భంగా నాయుడుపేటలోని పెద్ది ఎల్లారెడ్డి ఫంక్షన్‌హాలులో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీపై ప్రజలకు కొంచెమైనా సానుభూతి లేదని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీని ఉపేక్షించేది లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీని తరిమేసే వరకు నిద్రపోవద్దని మంత్రి కెటిఆర్ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీకి నారాయణ ఖేడ్‌లో లేని సంప్రదాయం పాలేరులో ఎందుకని ఆయన ప్రశ్నించారు.

ఓటమి భయంతోనే చీకటి రాజకీయాలు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నందమూరి తారకరామారావు తెలుగు దేశం పార్టీని స్థాపిస్తే.. ఇవాళ తెలుగుదేశం నేతలు కాంగ్రెస్‌తో జత కట్టడం శోచనీయమని కెటిఆర్ర్ విమర్శించారు. తెలుగుదేశం నేతల తీరుతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు.
అసాధారణమైన పరిస్థితుల్లో పాలేరు ఉప ఎన్నిక వచ్చింది.. తుమ్మల నాగేశ్వరరావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పాలేరులో గెలుపును.. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు బహుమతిగా ఇస్తామని మంత్రి కెటిఆర్ చెప్పారు. సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పలువురు టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమావేశం అనంతరం భారీ ర్యాలీగా వెళ్లిన మంత్రి తుమ్మల నామినేషన్ దాఖలు చేశారు.
ఇది ఇలా ఉండగా, మంత్రి హరీశ్ రావు పాలమూరు ఎత్తిపోతల పథకంపై మాట్లాడుతూ.. ఎత్తిపోతల పథకం కారణంగా భూములు కోల్పోయిన వారికి సాయం అందిస్తామిన తెలిపారు. అంతేగాక, డబుల్ బెడ్ రూం పథకంలో వారికి ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఉనికి కోసమే పాలమూరు ఎత్తిపోతల పథకంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications