పేదవాడికి ఇల్లు: '12 ఏళ్ల కిందట కేసీఆర్ తెలంగాణ వస్తదంటే నవ్వారు' (ఫోటోలు)
హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో మరిన్ని ఐడీహెచ్ కాలనీలకు టీఆర్ఎస్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. పేదవాడికి ఇల్లు అనే కాన్సెప్ట్‌తో ఐడీహెచ్ కాలనీ తరహాలో మరిన్ని డబుల్ బెడ్‌రూం కాలనీలు నిర్మాణం కానున్నాయి. గురువారం మంత్రి కేటీఆర్ చేతుల మీదగా గ్రేటర్ పరిధిలోని కంటోన్మెంట్‌లోని రసూల్‌పురాలో డబుల్‌బెడ్‌రూం ఇళ్లకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.
కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పేదలందరికీ గూడు కల్పించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. ఇందులో భాగంగా పైసా తీసుకోకుండా నిరుపేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టిస్తామన్నారు. ఇప్పటి వరకు లక్షా 8 వేల మందికి ఇళ్లపట్టాలిచ్చిన ఘటన కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందన్నారు.
హైదరాబాద్‌లో ఈ ఒక్క సంవత్సరంలోనే 10వేల డబుల్ బెడ్‌రూం ఇళ్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రసూల్‌పురాలో 205 ఇళ్లకు శంకుస్థాపన చేశామని, నాలుగేళ్లలో హైదరాబాద్‌లో లక్షపై చిలుకు ఇళ్లను నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
హైదరాబాద్ మహా నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు బృహత్తర ప్రణాళికలను సిధ్దం చేశామని, ఇందులో భాగంగా ఎండాకాలంలో నీరు, కరెంట్ కోత లేకుండా చూస్తామన్నారు. గోదావరి, కృష్ణా జలాలను హైదరాబాద్‌కు తీసుకొచ్చామన్నారు. పాఠశాలల్లో, సంక్షేమహాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం పెడ్తున్నామన్నారు.
ప్రజలు ఈ ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టారు కాబట్టి, ఐదేళ్లలో ఎంత సేవ చేయగలిగితే అంత సేవ చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ నిరుపేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమలను అమలు చేస్తున్నారని కొనియాడారు. 12 ఏళ్ల కిందట తెలంగాణ వస్తుందని కేసీఆర్ చెబితే అందరూ నవ్వారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
హైదరాబాద్‌లో ఉన్న నిరుపేదల కోసం పనిచేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. రాజీకీయాలకు అతీతంగా ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కట్టిస్తున్నామన్నారు. పేదవారు ఎవరైనా పేదవారేనని, అవసరమైతే లాటరీ సిస్టమ్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
నిరుపేదల కోసం పని చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని హైదరాబాద్ ప్రజలు ఆదరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి, నగర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
{photo-feature}












Click it and Unblock the Notifications