వారంలోగా క్షమాపణ చెప్పాలి, లేకుంటే - బండి సంజయ కు కేటీఆర్ నోటీసులు..!!
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రి కొండా సురేఖ తన పైన చేసిన వ్యాఖ్యలతో కేసు దాఖలు చేసిన కేటీఆర్..ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ కు నోటీసులు పంపారు. తాను డ్రగ్స్ తీసుకుంటానంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు.. తన పరవుకు నష్టం కలిగించాయని కేటీఆర్ ఆరోపించారు. వారం రోజుల్లో బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే లీగల్ యాక్షన్ తప్పదని హెచ్చరించారు.
బండి ఆరోపణలతో
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కు లీగల్ నోటీసులు పంపారు. బండి సంజయ్ ఈ నెల 19న తన పైన తప్పుడు ఆరోపణలు చేసారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డానని బండి సంజయ్ నిరాధారణ ఆరోపణలు చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తన తండ్రి కేసీఆర్ పేరును కూడా బండి సంజయ్ ప్రస్తావరించారని వివరించారు. తాను డ్రగ్స్ తీసుకుంటానంటూ ఆరోపణలు చేయటం పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. సంజయ్ కామెంట్స్ తన వ్యక్తిత్వాన్ని అవమానపరిచేలా, ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని నోటీసులో అభ్యంతరం వ్యక్తం చేసారు.

అప్రతిష్ఠ కలిగేలా
తనను వ్యక్తిగతంగా అప్రతిష్ట పాలు చేసేందుకే బండి సంజయ్ ఉద్దేశ పూర్వకంగా అర్దం లేని ఆరోపణలు చేసారని కేటీఆర్ పేర్కొన్నారు.కేసుల నుంచి తప్పించుకోవటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రహస్యంగా కలిసిపోయానంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను నిరూపించాలని కేటీఆర్ డిమాండ్ చేసారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇష్టానుసారంగా తన పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేస్తే చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు విస్తృతంగా మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయబడ్డాయని దీని కారణంగా ప్రజలు తనను తప్పుగా అర్థం చేసుకొనే ప్రమాదం ఉందని కేటీఆర్ అన్నారు.
దురుద్దేశ పూర్వకంగా
కేంద్రమంత్రిగా బాధ్యతయుతమైన పదవిలో ఉన్న బండి సంజయ్ లాంటి వ్యక్తి చేసే ఆరోపణలను ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం తనపై బురద చల్లాలన్న దురుద్దేశం, తమ పార్టీ రాజకీయ ఎజెండాను ముందుకు తీసుకెళ్లాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ నోటీసులో తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ సహా డ్రగ్స్ ఆరోపణలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. వాటిన్నింటిని ఉద్దేశపూర్వకంగా కల్పించిన కట్టుకథలుగా కొట్టిపారేశారు. రాజకీయంగా తనను ఎదుర్కొనే శక్తి లేకనే తన వ్యక్తిత్వంపై బురదచల్లే ప్రయత్నం గత కొన్ని సంవత్సరాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా క్షమాపణలు చెప్పకుంటే పరువు నష్టం దావా, క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ నోటీసుల్లో స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications