‘కేసీఆర్ వయస్సు తక్కువే: హరీశ్‌తో పోటీ లేదు, కోదండరాం ఎందుకో అలా’

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కేసీఆర్, హరీశ్ రావు గురించేగాక, కోదండరాం గురించి కూడా మాట్లాడారు. ప్రస్తుతం కేసీఆర్‌ వయస్సు 64 ఏళ్లేనని, భారత సమకాలీన రాజకీయాలను బట్టి చూస్తే కేసీఆర్‌ది చాలా చిన్న వయస్సని తెలిపారు.

మరో 15, 20 ఏళ్లు రాజకీయాల్లో ఉండి ఆయన పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిస్తారని చెప్పారు. ఆలోపు తాను లేదా హరీశ్‌ రిటైర్‌ కావొచ్చని తెలిపారు. 'ప్రస్తుతం కేసీఆర్‌గారే మాకు బాస్‌. మరో 15, 20 ఏళ్లు ఆయన నాయకత్వంలోనే అందరం కలిసి పనిచేస్తాం. మాకు స్వతంత్రంగా ఎజెండాలు లేవు. ఆశలు లేవు. హరీశ్‌ రావుతో ఆరోగ్యకరమైన పోటీ ఉంది. అధికారం కోసం మా మధ్య పోటీ లేదు' అని కేటీఆర్ స్పష్టంచేశారు.

ktr

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండున్నరేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన సూటిగా సమాధానాలు చెప్పారు. తమ కుటుంబంలో విభేదాలు లేవని, పార్టీలో హరీశ్‌తో తనకు ఆరోగ్యకరమైన పోటీ ఉందని స్పష్టం చేశారు. మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా లేకపోవడం లోటేనని అంగీకరించారు. ఆ లోటును ముఖ్యమంత్రి పూడుస్తారని భావిస్తున్నట్టు తెలిపారు.

'జేఏసీను ఏర్పాటుచేసింది, జేఏసీకి చైర్మన్‌గా కోదండరాంను నియమించింది కూడా కేసీఆర్‌గారే. కానీ ఏ కారణం వల్లనో ప్రభుత్వానికి ఆయనతో విభేదాలు వచ్చాయి. ఆ విభేదాలు పెరుగుతున్నాయి. ఎక్కడ టెంటు వేసినా వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం ఆయనకు కూడా మంచిది కాదు' అని కేటీఆర్‌ అన్నారు.

కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అనేక బాలారిష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని, ప్రజల విశ్వాసాన్ని చూరగొని.. వారితో శభాష్‌ అనిపించుకునేవిధంగా సాగుతోందని తెలిపారు. దేశవ్యాప్తంగా తెలంగాణ చాలావేగంగా ముందుకువెళ్లుతున్నదని, ఈ విషయం అనేక జాతీయ సర్వేల్లో వెల్లడైందని స్పష్టం చేశారు. ఇది కేసీఆర్ పాలనా దక్షతకు నిదర్శనమని చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Minister KTR tells about KCR and harish rao.
Please Wait while comments are loading...