మోడీ జీ.. మీరు గుజరాత్ కే కాదు.. భారతదేశానికి కూడా ప్రధానే: కేటీఆర్ విసుర్లు
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇటీవల కాలంలో నిత్యం కేంద్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తుందని అనేక విషయాలపై మోడీ సర్కార్ ను నిలదీస్తున్నారు. ఇక తాజాగా శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా అమిత్ షా ను టార్గెట్ చేశారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీకి తనదైన శైలిలో చురకలంటించారు మంత్రి కేటీఆర్.

అమిత్ షా పర్యటనను, మోడీని టార్గెట్ చేసిన కేటీఆర్
తెలంగాణలో అమిత్ షా పర్యటన నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో అభివృద్ధిపై మంత్రి సబితా ఇంద్రా రెడ్డి చేసిన ట్వీట్ ను రీ ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్ ఆ ట్వీట్ ద్వారా రంగారెడ్డి జిల్లాకు వస్తున్న అమిత్ షా గారికి స్వాగతం. కెసిఆర్ గారి నాయకత్వలో తెలంగాణ రాష్ట్రం ప్రగతిశీల విధానాలతో గొప్పగా అభివృద్ధి చెందింది. మీరు మా రాష్ట్రానికి, జిల్లాకి వస్తున్న తరుణంలో 8 సంవత్సరాలు ఏమి చేశారు, ఇంకా ఏమి చేస్తారు చెప్పాలిసిన అవసరం లేదా? అంటూ ప్రశ్నించారు.
విధానాలతో రండి విద్వేషాలు కాదు అంటూ సబితా ఇంద్రారెడ్డి చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేశారు. అంతేకాదు ఎనిమిదేళ్లుగా రాష్ట్రానికి ఒక మెడికల్ కాలేజీని కూడా మంజూరు చేయలేదని ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి కేటీఆర్ ట్వీట్ చేశారు.
మోడీజీ మీరు గుజరాత్ కే కాదు భారతదేశం మొత్తానికి ప్రధాని
మోడీజీ మీరు గుజరాత్ కే కాదు భారతదేశం మొత్తానికి ప్రధాని అని పేర్కొన్న కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం చర్యతో వైద్య విద్యకు దూరమైన యువత పరిస్థితి ఏంటంటూ ప్రశ్నించారు. ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణపై వివక్ష ఎందుకు చూపిస్తున్నారు అంటూ నిలదీశారు. గుజరాత్లో ఓ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరై అక్కడ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయూబ్ పటేల్ అనే ఒక వ్యక్తిని ప్రధాని నరేంద్ర మోడీ పలకరించారు. అతను తన కూతురు ఆశయాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి వెల్లడించారు. తన బిడ్డ భవిష్యత్తులో డాక్టర్ కావాలని కోరుకుంటుంది అని ఆయన తెలిపారు.

గుజరాత్ లో ఓ కార్యక్రమంలో భావోద్వేగానికి గురైన మోడీ
ఇక ఆయుబ్ పటేల్ పక్కనే ఉన్న కుమార్తెను డాక్టర్ కావాలని ఎందుకు కోరుకుంటున్నావని మోడీ ప్రశ్నించగా ఆ అమ్మాయి తన తండ్రి అనుభవిస్తున్న సమస్య అందుకు కారణం అని చెప్పి విలపించింది. సౌదీ లో పనిచేస్తున్న సమయంలో కంటి సమస్యతో ఐ డ్రాప్స్ వేసుకోవడంతో తన తండ్రి కంటిచూపును కోల్పోయారని చెప్పింది మిగతా వారిలో ఆయన స్పష్టంగా చూడలేకపోతున్నారని ఆ అమ్మాయి చెప్పడంతో ప్రధాని మోడీ భావోద్వేగానికి గురయ్యారు. భవిష్యత్తులో ఆమె కలను నెరవేర్చడానికి తప్పకుండా సహాయం చేస్తానని మోడీ ప్రకటించారు.

వీడియో షేర్ చేసి మరీ మోడీకి చురకలు
ఇక ఈ వీడియో ని షేర్ చేసిన తెలంగాణా మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సమస్యను ప్రధాని నరేంద్ర మోడీకి తెలియజేసే ప్రయత్నం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది ఏళ్ల నుండి కనీసం ఒక్క మెడికల్ కళాశాల కూడా మంజూరు చేయలేదని ప్రశ్నించారు. కేంద్రం చర్యతో వైద్య విద్యకు దూరమయ్యే యువత పరిస్థితి ఏంటని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.