తెలంగాణాలో రాబందుల రెక్కల చప్పుడు.. షాకింగ్ వీడియోతో!
తెలంగాణా రాష్ట్రంలో రైతులకు ద్రోహం చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రైతు భరోసా ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేస్తున్నారని నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించిన బీఆర్ఎస్ ఈ క్రమంలో రేవంత్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడింది.
రైతుల కోసం బీఆర్ఎస్ పోరాటం
రైతు భరోసాను ఎగ్గొట్టడాన్ని నిరసిస్తూ నిన్న రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ సర్కారుపై నిన్న అన్నదాతలు భగ్గుమన్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రైతులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండల కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు రాస్తారోకోలు, ధర్నాలు చేశారు. రైతులకు ద్రోహం చేసిన రేవంత్, ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేసి.. వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు.

ఎకరానికి రూ.15 వేల చొప్పున రైతు భరోసా ఇవ్వాల్సిందే
ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం ఎకరానికి రూ.15 వేల చొప్పున రైతు భరోసా ఇవ్వాల్సిందేనని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. గడచిన వానకాలం రైతుభరోసా ఇవ్వబోమంటే తాము ఊరుకోబోమని తేల్చిచెప్పారు. సబ్ కమిటీ నివేదిక వచ్చాకే యాసంగి సాయం అందిస్తామంటే సహించబోమని తేల్చిచెప్పారు.
రైతుబంధు ఎగిరిపోయింది కేటీఆర్ ఆగ్రహం
ఇక తాజాగా మరోమారు రైతుల ద్రోహి కాంగ్రెస్ పార్టీ అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతుబంధు ఎగిరిపోయింది..రాబందుల రెక్కల చప్పుడే మిగిలింది అంటూ ఆయన తెలంగాణా రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. రైతు భరోసా ఇవ్వకపోవటం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
రైతు ద్రోహి కాంగ్రెస్
.'రైతుబంధు కావాలా..? రాబందు కావాలా?. ఎన్నికల ముందు బీఆర్‌ఎస్ ఇచ్చిన నినాదం గుర్తుందా? అని ప్రశ్నించారు. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టుంది పరిస్థితి అంటూ కేటీఆర్ ప్రస్తుత రైతుల పరిస్థితిని చెప్పే ప్రయత్నం చేశారు. ఎకరానికి 15వేలు ఇస్తామని ఊదరగొట్టి.. ఉన్న పదివేలు ఊడగొట్టారని విమర్శలు గుప్పించారు. పంట పెట్టుబడి ఎగ్గొట్టడం అంటే.. అన్నదాత వెన్ను విరవడమే అని స్పష్టం చేశారు. రైతు ద్రోహి కాంగ్రెస్.. చరిత్ర నిండా అనేక రుజువులు ఉన్నాయని, ఇప్పుడు ఇంకొకటి అంటూ ఘాటు విమర్శలు చేశారు.
ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి -
— KTR (@KTRBRS) October 21, 2024
“రైతుబంధు ఎందుకు బందైతది? మేమేమన్న దీవానాగాళ్లమా, నాకేమన్నా ధమాక్ లేదా? రైతుల కష్టాలు మాకు తెల్వదా? “
7,500 కోట్లు వానాకాలం రైతుబంధు ఎగ్గొడుతనంటున్న
ఈయనను, నేడు తెలంగాణ రాష్ట్ర రైతులు ఏమనుకుంటారంటారు? pic.twitter.com/n2bBKdIW00
రేవంత్ వీడియోను పోస్ట్ చేసి మరీ టార్గెట్
ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి మాట్లాడిన ఒక వీడియోను పోస్ట్ చేసి టార్గెట్ చేశారు కేటీఆర్. "రైతుబంధు ఎందుకు బందైతది? మేమేమన్న దీవానాగాళ్లమా, నాకేమన్నా ధమాక్ లేదా? రైతుల కష్టాలు మాకు తెలియదా? " అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియో పోస్ట్ చేశారు. ఆపై నేడు 7,500 కోట్లు వానాకాలం రైతుబంధు ఎగ్గొడతా అంటున్న ఈయనను, తెలంగాణ రాష్ట్ర రైతులు ఏమనుకుంటారంటారు? అంటూ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications