రేవంత్ పాలనలో అప్పుల ఊబిలో తెలంగాణా!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ రాష్ట్రం నాశనం అయిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పది నెలల్లో 80 వేల 500 కోట్ల రూపాయలు అప్పు చేసినట్టు ఆరోపించారు.
అప్పు తప్పు అన్న వారిని దేనితో కొట్టాలో చెప్పాలి : కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో కేవలం పది నెలలలోనే 80500 కోట్ల రూపాయల రికార్డు అప్పులు అయ్యాయని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. గతంలో బీఆర్ఎస్ పాలనలో అప్పు తప్పు అని చెప్పారని, ఇప్పుడు అప్పు తప్పు అన్న వారిని దేనితో కొట్టాలో చెప్పాలని ప్రశ్నించారు.ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చలేదని టార్గెట్ చేశారు కేటీఆర్.

అంత అప్పు ఎందుకు చేశారు?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు ఏ కొత్త సాగునీటి ప్రాజెక్టును కట్టలేదని, మరి అంత అప్పు ఎందుకు చేశారో చెప్పాలని ప్రశ్నించారు . 80,500 కోట్ల రూపాయల డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్లిందో చెప్పాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో అప్పులు తీసుకుని ప్రాజెక్టులు కట్టామని, మౌలిక సదుపాయాలు పెంచామని, అప్పులు చేసినప్పటికీ ప్రజల దశాబ్దాల కష్టాలను తీర్చామని కేటీఆర్ వెల్లడించారు.
అప్పుల అడ్రెస్ ఎక్కడ?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెస్తున్న అప్పుల అడ్రస్ ఎక్కడ అంటూ ప్రశ్నించారు . అప్పు శుద్ధ తప్పు అంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన రేవంత్ ఇప్పుడు అదే అప్పల కోసం పాకులాడుతున్నారని విమర్శలు గుప్పించారు. కమిషన్ల కోసం కక్కుర్తిపడి అప్పులు చేస్తున్నారా? బడా కాంట్రాక్టర్ల బిల్లులకు ధారా దత్తం చేస్తున్నారా? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్ర సంపద సృష్టికి కాకుండా, సొంత ఆస్తులు కూడబెట్టుకోవటానికి అప్పులు చేస్తున్నట్టు ఆయన ఆరోపించారు.
రేవంత్ కుర్చీ ఎక్కిన రోజు నుండి తెచ్చిన మొత్తం అప్పులు 80,500 కోట్లు.
— KTR (@KTRBRS) October 16, 2024
10 నెలల్లో 80,500 కోట్ల రికార్డు అప్పులు!!
అప్పు- తప్పు అన్నోళ్లని.. ఇప్పుడు దేనితో కొట్టాలి..? ఎన్నికల హమీలేవీ తీర్చలేదు..!
ఏ కొత్త సాగునీటి ప్రాజెక్టు కట్టలేదు..!!
మరి ముఖ్యమంత్రి తెస్తున్న అప్పు ఏమైనట్టు…
తెలంగాణా రాష్ట్ర భవిష్యత్ పెను ప్రమాదంలో
తెలంగాణ రాష్ట్రంలో పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదని, రైతులకు ఇప్పటివరకు రైతు భరోసా వేయలేదని, కొత్త ప్రాజెక్టులు కట్టలేదని నెలలు తరబడి జీతాలు కూడా ఇవ్వడం లేదని, మరి అలాంటప్పుడు చేస్తున్న అప్పు ఏమైపోతుంది అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి రాష్ట్ర భవిష్యత్తును పెను ప్రమాదంలో పడేస్తున్నారు అని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications