కర్నూలు బస్సు ప్రమాదం ఎఫెక్ట్.. హైదరాబాద్ లో వారికి షాక్!
కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న బస్సు ప్రమాద ఘటనలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన తరువాత బస్సుకు ఫిట్నెస్ లేదని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. రవాణా శాఖ అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు చేపడుతున్నారు అన్న చర్చ కూడా జరిగింది. అయితే బస్సు ఫిట్నెస్ కు సంబంధించి ఏపీ రవాణా శాఖ కీలక ప్రకటన చేసింది.
కర్నూలు ప్రమాద ఘటనతో అలర్ట్ అయిన రవాణా శాఖ
బస్సుకు ఫిట్నెస్ ఉందని, ఇన్సూరెన్స్, పొల్యూషన్, అలాగే టూరిస్ట్ పర్మిట్ అన్ని ఉన్నాయని ప్రకటించింది. అయినప్పటికీ బస్సు ప్రమాదానికి గల కారణాలను పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని పేర్కొంది. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రవాణా శాఖ ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల పైన తనిఖీలు చేపట్టింది. రవాణా కమిషనర్ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ తనిఖీలను నిర్వహించింది.

అప్రమత్తమైన తెలంగాణా రవాణా శాఖ.. తనిఖీలు
ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా రవాణాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రైవేటు బస్సులను తనిఖీ చేస్తున్నారు. విజయవాడ హైవే, బెంగళూరు హైవేపై ఆర్టిఏ బృందాలు విస్తృత తనిఖీలను చేపట్టాయి. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో నిర్వహించిన తనిఖీలలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 12 బస్సులపై కేసులు నమోదు చేశారు, 8 బస్సులను సీజ్ చేశారు.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులలో తనిఖీలు.. బస్సులు సీజ్
సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఓఆర్ఆర్ మూడవ ఎగ్జిట్, రాజేంద్రనగర్ పరిధి గగన్ పహాడ్ వద్ద, ఎల్బీ నగర్‌లోని చింతలకుంట ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారుల తనిఖీలు చేస్తున్నారు. నిన్న కర్నూలులో జరిగిన బస్సు ప్రమాద ఘటన దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న ట్రావెల్స్ బస్సులలో ఫైర్ సేఫ్టీ, మెడికల్ కిట్లను పరిశీలిస్తున్నారు.ఎల్బీనగర్లోని చింతలకుంట వద్ద ఆర్టీఏ అధికారులు నిబంధనలు ఉల్లంఘించిన ట్రావెల్స్ బస్సును సీజ్ చేశారు.
నిబంధనలు ఉల్లంఘించిన బస్సులపై కేసులు
నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న మరో నాలుగు బస్సుల పైన కేసులు నమోదు చేశారు. హైదరాబాద్లో మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాలలో సైతం ప్రైవేటు బస్సులలో విస్తృత తనిఖీలను నిర్వహిస్తున్నారు. నల్గొండ, కోదాడ, మహబూబ్నగర్, కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలతో సహా హైదరాబాద్ శివారు ప్రాంతాలలో అధికారులు తనిఖీలు చేపట్టారు.
అన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ఆర్టీఏ అధికారులు
హైదరాబాద్ నగరానికి వచ్చే ప్రతి వాహనాన్ని అధికారులు తనిఖీ చేస్తున్నారు. బస్సు కు సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, ఆర్ సి, పర్మిట్, టాక్స్, ఫైర్ ఎస్టింగ్విషర్, డబుల్ డ్రైవర్ తో పాటు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్లు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు రవాణా శాఖ అధికారులు.












Click it and Unblock the Notifications