లండన్‌లో మా ఆడబిడ్డ మేయర్ కావడం గర్వ కారణం: బొంతు రామ్మోహన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం హైదరాబాద్ నగరం గణనీయంగా అభివృద్ది చెందుతోందని దక్షణ లండన్‌లోని ల్యాంబెత్ నగర మేయర్ సలేహా జాఫర్ అభిప్రాయపడ్డారు. నల్గొండ పట్టణానికి చెందిన సలేహా జాఫర్ లండన్‌లో స్థిరపడి ల్యాంబెత్ నగర మేయర్ పదవిని పొందారు.
హైదరాబాద్ నగర పర్యటనకు వచ్చిన సలేహా జాఫర్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌ను గురువారం జీహెచ్ఎంసీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సలేహా జాఫర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం హైదరాబాద్ నగరానికి లండన్‌లో ప్రత్యేక గుర్తింపు లభించిందని అన్నారు.

గతంలో తాను హైదరాబాద్ నగరంలో పర్యటించానని అప్పటికి ప్రస్తుత పర్యటనకు మధ్య నగరంంలో గణనీయమైన అభివృద్ది కన్పిస్తోందని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడానికి
స్టాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్‌తో సహా అనేక అభివృద్ది కార్యక్రమాలు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ నగర కౌన్సిల్ సమావేశం నిర్వహణ, ల్యాంబెత్ నగర కౌన్సిల్ నిర్వహణ విధానం సామిప్యతతో ఉందని పేర్కొన్నారు. 6లక్షల జనాభా పైగల ల్యాంబెత్ నగరంలో 57 విభిన్న భాషలు మాట్లాడే పౌరులతో మినీ ప్రపంచం మాదిరిగా ఉంటుందని వివరించారు.

ఎన్నో దశాబ్దాల క్రితం లండన్‌లో స్థిరపడ్డప్పటికీ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు మరవలేదని పేర్కొన్నారు. లేబర్ పార్టీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నానని, తన నగరంలో 65మంది కౌన్సిలర్లు ఉన్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ మేయర్‌ను తమ నగరంలో పర్యటించాల్సిందిగా ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు.
ల్యాంబెత్ నగర మేయర్ సలేహా జాఫర్‌కు ఘనంగా స్వాగత సత్కారాలు చేసిన మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆడ బిడ్డ అయిన సలేహా జాఫర్ ల్యాంబెత్‌నగర మేయర్‌గా ఉండటం గర్వకారణమని అన్నారు. ఈ సందర్భంగా విశ్వనగర ప్రణాళికలో భాగంగా హైదరాబాద్ నగరంలో చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలను వివరించారు.












Click it and Unblock the Notifications